రిలయన్స్ జియో సేవలు ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే భారతీయ టెలికామ్ మార్కెట్లో ఎన్నో సంచలనాలను సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ఇప్పటికే 22 కోట్ల కన్నా ఎక్కువమంది ఖాతాదారులను సంపాదించుకోగలిగింది. సగటున ఒక్కొక్క జియో ఖాతాదారుడు, యూరోపియన్ మొబైల్ ఖాతాదారుడి కన్నా మూడు రెట్లు ఎక్కువ డేటాను మొబైల్ ఫోన్ ద్వారా వినియోగించుకుంటున్నాడు. జియో మార్కెట్లోకి వచ్చిన తరువాతే కోట్లాది మంది భారతీయులు మొదటిసారిగా ఇంటర్నెట్ను వినియోగించటం ప్రారంభించారు.
ప్రపంచ టెలికాం రంగంలో అతి తక్కువ సమయంలో ఇంత మంది ఖాతాదారులను సమకూర్చుకున్న సంస్థ ఇది ఒక్కటే. అంతేకాక ఏ సంస్థ వినియోగదారుడు కూడా సగటున ఇంత డాటాను వినియోగించటం లేదు. అయితే జియో ఇలా విప్లవాత్మక విధానాలతో మార్కెట్ ను ఆక్రమించుకోవటం ప్రత్యర్థి సంస్థలను ఆత్మరక్షణలో పడేసి నష్టాలలో కూరుకుపోయేలా చేసింది. ముకేష్ అంబానీకి స్వయంగా తమ్ముడైన అనిల్ అంబానీ కూడా ఇలా తీవ్రంగా నష్టపోయిన వారి జాబితాలో ఉన్నారు. అతని సంస్థ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ పూర్తి స్థాయిలో దివాళా తీసి టెలికాం సేవలు నిలిపివేసింది. ఇప్పుడు అనిల్ మిగిలిన మొబైల్ టవర్లు, స్పెక్ట్రం మరియు ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ను తన సోదరుడికి విక్రయించి ఋణాలు చెల్లించాలని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెలికాం సేవలకు పేరుగాంచిన యూకేకు చెందిన వోడాఫోన్ సంస్థ కూడా జియో ధాటికి తట్టుకోలేక తీవ్ర నష్టాలపాలయింది. గత సంవత్సరంలోనే తాము భారతీయ మార్కెట్లో 4000 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయినట్లు ప్రకటించింది. ఐడియా కూడా తీవ్ర స్థాయిలో నష్టపోవటమే కాకుండా భారీ స్థాయిలో కస్టమర్లను చేజార్చుకుంది. మరో సంస్థ అయిన ఎయిర్ సెల్ భారతీయ మార్కెట్లో పెట్టిన ఏడు బిలియన్ డాలర్లను అంటే 50వేల కోట్ల రూపాయలను నష్టపోయి దివాళాతో భారతీయ మార్కెట్ నుండి వైదొలిగింది. మన దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ నష్టపోకున్నా, నికర లాభం మాత్రం పూర్తి స్థాయిలో కుంచించుకుపోయింది.
జియో సంస్థ టెలికాం రంగంలోకి ప్రవేశించిన విధానం కూడా ఆసక్తికరమైన కథే. జూన్ 2010లో ప్రభుత్వ టెలికాం విధానంలో భాగంగా స్పెక్ట్రం యొక్క వేలం నిర్వహించింది. విక్రయించబడుతున్న బ్యాండ్ విడ్త్ ధర అధికంగా ఉందని టెలికాం సంస్థలు భావిస్తున్న ఆ సమయంలో, ఎవరికీ అంతగా పరిచయం లేని ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ అనే సంస్థ ఏకంగా 12,800 కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా బ్యాండ్ విడ్త్ ను కొనుగోలు చేసింది. అయితే ఆ మొత్తం ఇన్ఫోటెల్ సంస్థ నికరవిలువ కన్నా 5000 రేట్లు ఎక్కువ. అయితే వేలం ముగిసిన వెంటనే ఇన్ఫోటెల్ సంస్థలో 95 శాతాన్ని 4800 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు రిలయన్స్ సంస్థ ప్రకటించింది.
అయితే ఇలా సామర్థ్యం లేని కంపెనీని ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)లు బిడ్డింగ్ కు అనుమంతించటాన్ని మిగిలిన టెలికాం సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. దొడ్డిదారిన టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ సంస్థ ప్రవేశించటానికి అవే మార్గం సుగమం చేశాయని దుయ్యబట్టాయి.
2016 సెప్టెంబర్ ఒకటవ తేదీన రిలయన్స్ జియో సంస్థ సేవలు ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. సేవలలో భాగంగా వాయిస్ కాల్స్ ఉచితమని ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ లో భాగంగా మూడు నెలల పాటు డేటా కూడా దాదాపు ఉచితమని ప్రకటించింది. మూడు నెలల తరువాత అదే ఆఫర్ కు చిన్న చిన్న మార్పులు చేసి మరో మూడు నెలలు కొనసాగించింది. దానితో కొంతకాలంలోనే 10 కోట్ల కస్టమర్లను సంపాదించగలిగింది. ఆ తర్వాత కూడా వాయిస్ కాల్స్ ఉచితంగా, డేటా సేవలకు కూడా దాదాపు నామమాత్ర రుసుములతో ప్లాన్లను ప్రకటించింది.
నష్టంతో కూడిన ప్రారంభ ఆఫర్ ను 90 రోజులకు మించి కొనసాగించకూడదని ట్రాయ్ నిబంధన ఉండటంతో అవి ఫిర్యాదు చేసాయి. అయితే జియో మాత్రం తమ నిర్వహణ వ్యయం తక్కువ అని, తాము ఈ రుసుములతోనే లాభాలు సంపాదిస్తామని వాదించింది. ఎయిర్ టెల్ ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. తమ నిర్వహణ వ్యయం జియో ప్లాన్ చార్జీల కంటే ఎక్కువనీ, మార్కెట్లో గుత్తాధిపత్యం కోసమే ఆ సంస్థ అబద్దాలాడుతోందని వాదించింది. ఏది ఏమైనా తుది తీర్పు జియోకు అనుకూలంగా వచ్చింది.
రిలయన్స్ జియో టెలికాం మార్కెట్ సంచలనాలతో ఇంటర్నెట్ను అందరికీ అందుబాటులోకి తేవటం ద్వారా దేశంలో దీర్ఘకాలిక సాంఘిక మరియు ఆర్ధిక మార్పులకు కారణమైంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఎక్కువ డేటాను వినియోగించటం అనేది మిగిలిన రంగాలలో కూడా అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆర్ధిక వేత్తలు భావిస్తున్నారు.
Post a Comment