ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణా చేరకపోవటంపై అమిత్ షా కడుపుమంట

అమిత్ షా తన తెలంగాణ పర్యటన సందర్భంగా కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరకపోవటంపై, ఎన్నికల హామీలపై, ఉద్యోగాలు కల్పించకపోవటంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు.   

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణాలో అమలు చేసేందుకు నిరాకరించటాన్ని అమిత్ షా మనసులో పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో పేదలు అనారోగ్యంతో చనిపోతే అందుకు బాధ్యత వహించవలసింది కేసీఆరేనని కూడా ఆయన అన్నారు. వాస్తవంగా తెలంగాణాలో ఇప్పటికే అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం చాలా విధాలుగా ఆయుష్మాన్ భారత్ కన్నా మెరుగైనది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ పథకం ద్వారా ఆరోగ్య సేవలు లభిస్తున్నాయి. అయితే  ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ది పొందేందుకు అనేక కఠిన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం తెలంగాణాలో కేవలం ఇరవై లక్షల కుటుంబాలు మాత్రమే ఉచిత ఆరోగ్య సేవలకు అర్హులవుతారు. ఒకవేళ ఆ పథకంలో చేరితే తెలంగాణకు కేంద్రవాటా కింద 212 కోట్లు లభించేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏటా 700+ కోట్లతో 89 లక్షల కుటుంబాల కోసం ఆరోగ్యశ్రీని సమగ్రంగా అమలు చేస్తుంది. ఇందు నిమిత్తమై ఇప్పటికే చాలా వరకు కార్పొరేట్ ఆసుపత్రులతో అవగాహనా ఒప్పందాలు ఉన్నాయి. కేంద్ర పథకంలో చేరితే వీటన్నింటినీ సమీక్షించవలసి వచ్చేది. అంతే కాకుండా ఆయుష్మాన్ భారత్ లో చేరితే ఆరోగ్యశ్రీ కార్డు బదులు ఆ కార్డు ఇచ్చి దానిపై మోడీ బొమ్మను మాత్రమే పెద్దగా ముద్రించాలని నిబంధన ఉంది. ఏళ్ల తరబడి రాష్ట్రం కొసాగిస్తున్న ఆరోగ్య పథకాన్ని వదిలి ఎన్నికల ముందు మోడీకి క్రెడిట్ ఇవ్వడానికి సహజంగానే కెసిఆర్ ఇష్టపడలేదు. అయితే ఈ పథకంలో తెలంగాణ చేరకపోవటంతో అనేక జాతీయ పత్రికలు దీనిపై విశ్లేషించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యశ్రీతో పోలుస్తూ, ఆరోగ్యశ్రీ మెరుగైనదని కితాబిచ్చాయి. దానితో కెసిఆర్ వలననే ఆ పథకం ప్రవేశపెట్టినప్పటికీ రావలసినంత పేరు రాలేదనే దుగ్ధతో అమిత్ షా ఈ విమర్శ చేసినట్లు కనిపిస్తుంది. 

ఇక అమిత్ షా చేసిన ఇతర విమర్శలలో సరిపోయినన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించక పోవటం, ఉద్యోగావకాశాలు కల్పించకపోవటం వంటి వాటిలో చాలా వరకు వాస్తవముంది. కానీ కేంద్రములో బిజెపి ప్రభుత్వం, మోడీలు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఒక్కొక్కరి అకౌంట్లో 15లక్షలు వేస్తాము లాంటి అసంబద్ధమైన హామీలను వారు అసంఖ్యాకంగా ఇచ్చారు. కేంద్రంలో 2014లో ఉన్న ఉద్యోగుల సంఖ్య కంటే ఇప్పుడు తక్కువ ఉన్నారు. కార్పొరేట్లను తప్ప ప్రభుత్వ సంస్థలను మోడీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పెద్దగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది కూడా లేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post