రాజకీయాల్లో అందరూ అంతే

ఇప్పటి రాజకీయ నాయకులకు ఎలాగైనా సరే అధికారంలోకి రావడమే ముఖ్యం. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమ గతంతో తమకే మాత్రం సంబంధం లేనట్లుగా, అమ్నీషియా వచ్చిన వారిలాగా వ్యవహరించగలరు. తమలో కూడా అదే లోపం ఉన్నాసరే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా, అదే విషయంపై ప్రత్యర్ధులను తిట్టగలరు. ఇలా ప్రజలను ఏమార్చటాన్ని తప్పు చేయటంగా కాకుండా, తమ తెలివితేటలనీ, వాక్చాతుర్యమనీ గర్వపడుతుంటారు. ప్రజల జ్ఞాపక శక్తి మరీ తక్కువని, వారిని సులభంగా మళ్ళీ మళ్ళీ  మోసగించవచ్చునని వారికి అంతులేని విశ్వాసం. 

తరతరాలుగా కుటుంబ పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ అధ్యక్ష్యుడిగా ఉంటూ, తనతో పాటు భార్య కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవతల పార్టీలో కుటుంబ పాలన గురించి మాట్లాడవచ్చునా?  

తెలంగాణ ఉద్యమం సందర్భంగా అమరులైన వారిని కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అమరులు, వారి కుటుంబాలు అని మాట్లాడే ఆవిడ, వారు చనిపోయినప్పుడు మంత్రిగా ఉంటూ ఏం చేసారు? ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అరుణగారు అప్పుడు వారి అంత్యక్రియలకు కూడా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వంలో భాగస్వామి అనే విషయం మర్చిపోతే ఎలా? 

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అయితే ఇటువంటి ప్రసంగాలలో ఆరితేరారు. కెసిఆర్ ను మోడీ జీతగాడు అని అన్నాడు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వాళ్లు రాహుల్ జీతగాళ్లా? అయినా అలా అనటానికి కెసిఆర్ ఏమీ బిజెపితో పొత్తులో లేడే? మొన్నటి వరకూ టిడిపిలో ఉండి బిజెపి పొత్తులో భాగంగా ఆయన మోడీ దగ్గర జీతం తీసుకున్నారేమో? అలాగే ఐటీ దాడుల సందర్భంగా ఒక సభలో మాట్లాడుతూ ఇదే నా చివరి ప్రసంగం, జైలు నుంచి నామినేషన్ వేస్తానేమో అని వ్యాఖ్యానించిన రేవంత్, మరో నాలుగు రోజుల తరువాత అరెస్టు జరగకపోయేసరికి సోదాలతో ఏం సాధించారు? నా వెంట్రుక కూడా పీకలేరు. అని అనటం రెండు నాలుకల ధోరణిని సూచిస్తుంది.  

కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక ప్రసంగంలో తాము అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణాన్ని ఆపివేస్తామని హెచ్చరించారు. ఇది మరీ ప్రమాదకరమైన ధోరణి. ఒకవేళ కాలుష్య సమస్యలు ఉంటే, ప్రమాణాలపై పట్టుపట్టాలి. అయినా కేంద్రం  ప్లాంట్ల విషయంలో ఉదాసీనంగా ఏమీ లేదు. కఠినమైన పర్యావరణ నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఆయన ఆ నియోజకవర్గంలో పొందే లబ్ధి సంగతేమోగానీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది.  మాకు కరెంటు కావాలి కానీ ప్లాంటు వద్దు అంటే ఎలా? 

ఇక హరీష్ రావు మహా కూటమిని అతుకుల బొంతగా వర్ణించాడు. 2009లో టిడిపితో పొత్తుపెట్టుకున్నప్పుడు అది కూడా ఇటువంటి అతుకుల బొంత అని మర్చిపోయాడు. కెసిఆర్ గారు కూడా తనని బట్టేబాజ్ అని అన్నారని వ్యాఖ్యానించటం కూడా ఇలాంటిదే.

0/Post a Comment/Comments

Previous Post Next Post