ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన ఐదు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టతను కూడా ఇచ్చింది.
కర్ణాటకలోని షిమోగా, మాండ్య బళ్ళారి స్థానాలకు చెందిన ఎంపీల రాజీనామాలు ఈ సంవత్సరం మే 18వ తేదీన ఆమోదం పొందాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలు 2019 జూన్ 3 వ తేదీన జరగనుండటంతో అక్కడ కొత్తగా ఎంపికవనున్న ఎంపీలు దాదాపు ఆరు నెలల కాలం మాత్రమే పదవిలో ఉండనున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పీవీ మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేసినప్పటికీ, వాటిని స్పీకర్ సుమిత్ర మహాజన్ జూన్ 4వ తేదీన ఆమోదించారు. నిబంధనల ప్రకారం స్థానం ఖాళీ అయిన సంవత్సరం లోపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం లేదు. ఇలా కర్ణాటక ఎంపీల కంటే ముందుగా రాజీనామాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎంపీల స్థానాలకు స్పీకర్ నిర్ణయంలో జాప్యం వలన ఎన్నికలు జరగటం లేదు.
Post a Comment