తెలుగు భాషా సౌందర్యం

భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. తెలుగును మాట్లాడగలిగే ప్రజల సంఖ్య విషయంలో భారత దేశములో హిందీ తర్వాత రెండవ స్థానములోనూ, ప్రపంచంలో పదిహేనవ స్థానములోనూ నిలుస్తుంది. తెలుగును మాతృభాషగా కలిగిన వారి సంఖ్య విషయంలో భారతదేశంలో నాలుగవ స్థానమును కలిగి ఉంది. ఈ మన తెలుగు భాష ప్రత్యేకతలు కొన్ని ఇక్కడ తెలుసుకుందాం. 
  • ఏనుగు దంతాలు కనపడేవి వేరే, తినడానికి వేరే అన్నట్లుగా ఆంగ్లము మరియు ఇతర యురోపియన్ భాషలలో రాతలో కనిపించేది వేరే మరియు ఉచ్చారణ వేరే అన్న విధంగా ఉంటుంది. దీనికి మనం చిన్నప్పటి నుండి చెప్పుకునే ఉదాహరణ But, Put లు ఒకే కనిపించినా ఉచ్చారణ మాత్రం వేరు వేరుగా ఉంటుంది. తెలుగు లిపిలో ఇటువంటి ఇబ్బందులు ఉండవు. ఏ పదమునైనా రాసిన విధముగా ఉచ్ఛరించవచ్చు. లిపిలో ప్రతి అక్షరానికి ప్రాతినిధ్యం ఉంటుంది. దాదాపుగా మనం నోటితో ఉచ్ఛరించే ప్రతి పదాన్ని లిపిలో రాసే సౌలభ్యం ఉంది. భారతీయ భాషలలో తెలుగుతో సహా ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషల లిపులన్నీ బ్రహ్మీ లిపి నుండే ఉద్భవించటంతో భారతీయ భాషలన్నింటికీ ఇది వర్తిస్తుంది.  

  • వాక్య నిర్మాణం విషయానికి వస్తే తెలుగులో మనకు వాక్యాన్ని నచ్చిన విధముగా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఉదాహరణకు ఆంగ్లములో She(S) Ate(V) Apple(O)  అనే వాక్యాన్ని ఈ క్రమములో కాకుండా మిగతా ఏ క్రమము లో [Like She(S) Apple(O) Ate(V), Ate(V) Apple(O) She(S) etc] రాసినా అది వ్యాకరణం ప్రకారం తప్పవుతుంది. అదే 'ఆమె ఆపిల్ తిన్నది' అనే విషయంలో ఆమె తిన్నది ఆపిల్, ఆపిల్ తిన్నది ఆమె, ఆపిల్ ఆమె తిన్నది ఇలా మనకు ఏ విధముగా మార్చుకున్నా అది సరియైనదే అవుతుంది.   

  • తెలుగు భాష ఉచ్చారణలో అచ్చులతో అంతమవుతుంది. కాబట్టి దీనిని అజంత భాషగా పిలుస్తారు. 16వ శతాబ్దానికి చెందిన ఇటలీ యాత్రికుడు నికోలె డి కాంటే, ఈ విషయంలో ఇటాలియన్ భాషతో సారూప్యత కలిగి ఉందని తెలుగును 'ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్' గా వర్ణించాడు. 

  • తెలుగులో కొన్ని పదాలు రెండుమార్లు ఉచ్ఛరించటం ద్వారా అర్థాన్ని కలిగి భాషకు ప్రత్యేక అందాన్నిచ్చాయి. చకచకా, బిరబిరా లాంటివి. తెలుగుభాష సంగీత, సాహిత్యాలకు అనువైనదిగా వర్ణింపబడినది. కర్ణాటక సంగీతానికి దాదాపు తెలుగు సాహిత్యమే ఆధారంగా నిలిచింది.   

  • తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందనే అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ తెలుగు ద్రవిడ భాషా వర్గానికి చెందినది. ఈ ద్రవిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, గోండీ మొదలైన 85 భాషలుండగా, ఇప్పుడు కేవలం 26 భాషలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న ద్రావిడభాష తెలుగే. మరో ద్రవిడ భాష అయిన బ్రహుయిని  పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్లలో ఇప్పటికీ ఇరవై అయిదు లక్షలమంది ఉపయోగిస్తున్నారు. తెలుగులో ప్రారంభకాలమునకు చెందిన రచనలన్నీ సంస్కృత అనువాదములు కావటంతో సంస్కృత భాషా ప్రభావం కూడా తెలుగుభాషపై, తెలుగు పదాలపై ఎక్కువగానే ఉంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post