అమరావతి ఇటుక ఘోర వైఫల్యం

రాష్ట్ర విభజన జరిగిన తరువాత నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి నగరాన్ని ఎంపిక చేసారు. ఆ సమయంలో నూతనంగా నిర్మింపబడే రాజధానిపైన మీడియాలో జరిగిన విపరీతమైన సానుకూల ప్రచారంతో ఒక విధమైన హైప్ క్రియేట్ కావటం జరిగింది. ప్రజలలో కూడా నూతన రాజధాని పట్ల తీవ్రమైన భావోద్వేగాలు, అపరిమితమైన ఉత్సాహం మరియు కల్పనకు కూడా అందని అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వం కూడా అమరావతిని ప్రజా రాజధానిగా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములయ్యే విధముగా 'మై బ్రిక్ మై అమరావతి' పేరుతో ఒక్కొక్కరు కనీసం పది రూపాయలు ఇటుకలు విరాళంగా ఇవ్వాలని కోరింది.

ఇవన్నీ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు. ఇప్పుడు ఒకసారి పరిస్థితిని సమీక్షించుకుంటే భావోద్వేగాలు, విపరీతమైన అంచనాలు కరిగిపోయాయి. ఎక్కువ శాతం మంది ప్రజలలో రాజధాని పట్ల ఒకవిధమైన నిర్లిప్తత నెలకొంది. ఇక మై బ్రిక్ మై అమరావతి అయితే ఊహించిన దానిలో కనీస స్పందనను కూడా అందుకోవటంలో విఫలమైంది. ప్రభుత్వ అండదండలు ఉన్నప్పటికీ దీని ద్వారా సేకరించిన విరాళాల మొత్తం 6 కోట్లకు కూడా చేరలేదు. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక కేరళ సహాయ నిధికోసం గత నెల రోజులలోనే ఇంత కన్నా పెద్ద మొత్తాన్నిసేకరించగలిగింది అంటేనే ఈ ఇటుకల విరాళం ఏ స్థాయిలో విఫలమైందో అర్థమవుతుంది. 

మై బ్రిక్ మై అమరావతి పరిణామ క్రమం
  • 2015 అక్టోబర్‌ 15న మై బ్రిక్ మై అమరావతి వెబ్సైటుని ప్రారంభించి ప్రతి ఒక్కరూ ఇటుకలను కొని విరాళాల ద్వారా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబునాయుడు కోరారు. ఇక్కడ ఒక్కొక్క ఇటుక ఖరీదును పది రూపాయలుగా నిర్ణయించారు.
  • తొలి రోజున దాదాపు  2 లక్షల ఇటుకలను ప్రజలు కొనుగోలు చేసారు. అమరావతి శంఖుస్థాపన తేదీ అయిన అక్టోబరు 23నాటికి అంటే దాదాపు వారం రోజులలోనే  ఇటుకల అమ్మకాలు 33 లక్షలకు చేరుకున్నాయి.
  • తొలి మూడు నెలలలో ఇటుకల అమ్మకాలు 50 లక్షలకు  చేరుకున్నాయి. ఆ తరువాత ఒక్కసారిగా అమ్మకాలలో స్తబ్దత ఆవరించింది. నేటికి మొత్తం ఇటుకల అమ్మకాలు కేవలం 57 లక్షలు మాత్రమే కావటం గమనార్హం. అంటే వచ్చిన విరాళాల మొత్తం 5.7 కోట్లు మాత్రమే.
ప్రజా రాజధానిగా ప్రచారం చేసుకున్న అమరావతి విరాళాల విషయంలో ప్రజల స్పందన ఎందుకు కరువైంది అని విశ్లేషిస్తే వివిధ కారణాలు కనిపిస్తున్నాయి. 

భారీ స్థాయిలో రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం తరువాత ఊపందుకోవలసిన విరాళాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రజల నుండి విరాళాలు కావాలనుకున్నప్పుడు వాటిలో ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందనే నమ్మకాన్ని వారికి కలిగించగలగాలి. అట్టహాసంగా జరిగిన శంఖుస్థాపన కార్యక్రమం మేము దుబారా చేస్తాము మీరు మాత్రం విరాళాలు ఇవ్వండి అనే తీరుగా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తరువాత కాలములో రాజధాని నిర్మాణం కోసమంటూ సాగిన అధికారులు, మంత్రుల సింగపూర్ మరియు ఇతర విదేశీ పర్యటనలు, విదేశీ కన్సల్టెంట్లు, విదేశీ సంస్థలే గొప్ప అన్నట్లు ప్రవర్తించటం, ప్రయివేట్ సంస్థలకు రాజధాని ప్రాంతంలో భారీ భూ కేటాయింపులు ఈ దుబారా భావనను మరింత పెంచాయి.  

అమరావతి ఇటుక అమ్మకాలకు అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్దగా స్పందించింది, ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది కూడా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలే విస్మరించినప్పుడు ప్రజల్లో ఆసక్తి పెరగకపోవడం కూడా సహజమే.

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రం సమకూరుస్తుందని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. రాష్ట్రం ఏర్పడి అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తరువాత సాధ్యమైనంత త్వరగా మౌలిక వసతులు, పరిపాలనా భవనాల తుదిరూపు ఖరారు చేసి కేంద్రం నుండి ఆమేరకు నిధులకోసం ప్రయత్నించవలసిన ప్రభుత్వం, తాత్కాలిక భవనాల నిర్మాణం పేరుతో కాలయాపన చేయటమే కాక నాలుగు సంవత్సరాలలో పరిపాలనా భవనాల తుదిరూపుపై స్పష్టత తీసుకు రాలేకపోయిందని కొంత మంది అభిప్రాయం. ఇలా రాజధాని కోసం కేంద్రం నిధులు పొందకుండా  విరాళాలు సేకరించటం అసంబద్ధ విధానంగా వారి భావన.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత సచివాలయంలో నూతన రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించటానికి హుండీలు ఏర్పాటు చేసారు. వాటిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావటంతో వాటిని వెంటనే తొలగించటం జరిగింది. అయితే రాజధాని ఎంపిక తరువాత ప్రభుత్వమే మై బ్రిక్ మై అమరావతి అనే క్యాప్షన్ తో అమరావతి వెబ్సైటును ఏర్పాటు చేసి విరాళాలను ఆహ్వానించింది. హుండీ ద్వారా విరాళాలు సేకరించటం సరియైనది కానప్పుడు వెబ్సైటులో సేకరించటం ఎలా సరియైనదో పాలకులకే తెలియాలి. ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తే రాజధాని ప్రజల  భాగస్వామ్యంతో నిర్మింపబడినట్లే. ప్రజల భాగస్వామ్యం కోసమే విరాళాలు అని ప్రచారం చేయటంలో పెద్దగా ఔచిత్యం కనిపించదు. రాజధాని కోసం కావాలనుకుంటే ప్రభుత్వం ప్రత్యేకంగా సెస్ విధించవచ్చు.  

అమరావతిని చాలా మంది ప్రజలు కొన్ని జిల్లాలకు, కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారని, అందుకే ఇటుకల కొనుగోళ్లపై ప్రజల నుండి పెద్దగా స్పందన రావడం లేదనే మరొక వాదన కూడా వ్యాప్తిలో ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post