భారత ఎనర్జీ ఎక్స్చేంజిలో స్పాట్ విద్యుత్ ధరలు ఆకాశాన్నంటాయి. గత కొంత కాలంగా క్రమంగా పెరుగుతున్న ధరలు, ఈ వారంలో పీక్ అవర్లో యూనిట్ కు 14 రూపాయలకు చేరి కొత్త రికార్డులను సృష్టించాయి. 24x7 విద్యుత్ ను అందిస్తున్న తెలంగాణ, తమిళనాడు, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కొనుగోళ్లు పెరగటంతో స్పాట్ విద్యుత్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎక్స్చేంజిలో డిమాండ్ 300 మిలియన్ యూనిట్లకు చేరగా లభ్యత 200 మిలియన్ యూనిట్లు కూడా లేకపోవటంతో ధరలు పెరుగుతున్నాయి.
అన్ని రాష్ట్రాలలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. వ్యవసాయ వినియోగానికి కీలక సమయం కావటం, వినాయక చతుర్థి వేడుకలు ఉండటంతో అన్ని రాష్ట్రాలు సాయంత్రం పీక్ అవర్ డిమాండ్ ను తట్టుకోవటానికి విచ్చలవిడి కొనుగోళ్లు జరుపుతున్నాయి. సెప్టెంబర్ నెలలో జల విద్యుత్ మరియు పవన విద్యుత్ లభ్యత కూడా తగ్గిపోవటం కూడా లభ్యత తగ్గిపోవటానికి మరో కారణం.
సాయంత్రం వేళలో రాష్ట్రాలు 11000 మెగావాట్ల కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసాయి. కానీ ఎక్స్చేంజిలో కేవలం 7000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండటంతో పోటీ పెరిగి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ స్థాయి ధరలకు చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు చివరకు వినియోగదారులకు భారంగా మారనున్నాయి.
Post a Comment