కెసిఆర్ ప్రభుత్వ పాలనపై సమీక్ష

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఎన్నో ఆశలు, ఎన్నెన్నో అంచనాల మధ్య మరెన్నో హామీలతో కెసిఆర్ ప్రభుత్వం కొలువు తీరింది. నాలుగేళ్లకుపైగా పాలనను సాగించిన ప్రభుత్వం తమ నిర్దేశిత పదవీ కాలం పూర్తి కాకుండానే ముందస్తు ఎన్నికలకు వెళుతోంది. ఈ పదవీకాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు మరియు వైఫల్యాలను ఒకసారి సమీక్షించుకుందాం.

కెసిఆర్ ప్రభుత్వ విజయాలు.........

విద్యుత్ విజయం


కెసిఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలలో విద్యుత్ సమస్యను పరిష్కరించడాన్ని ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరం భారీ లోటుతో, అనేక గంటల కోతలతో  విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయితే ఆశ్చర్యకరంగా సంవత్సరం లోపలే ఈ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి కోతలు లేని నిరంతర సరఫరా చేయగలిగింది. అంతేకాక రైతులకు 24x7 ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఏర్పడితే కొన్ని సంవత్సరాలపాటు తీవ్ర విద్యుత్ ఇబ్బందులు ఎదుర్కొంటారని చేసిన వాఖ్యలు ఈ విజయానికి ఉన్న ప్రాముఖ్యతను మరింతగా పెంచాయి. 

విద్యుత్ రంగంలో విజయం వెనుక ప్రభుత్వ కృషి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. సమయోచిత విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ వ్యవస్థను మెరుగుపరచటం ద్వారా వారు ఈ ఘనతను సాధించారు. 2014లో అయిదు వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కు సరిపడా సరఫరా చేయలేని స్థితినుండి ఇవాళ పదివేల మెగావాట్ల పైచిలుకు డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయగలిగే స్థాయికి చేరుకోవటం సామాన్యమైన విషయమేం కాదు. సరియైన సోలార్ విద్యుత్ పాలసీ, రాష్ట్రం ఏర్పడే నాటికే నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంటులను త్వరితగతిన పూర్తి చేయటం, కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడం లాంటివి కూడా దీనికి దోహదపడ్డాయి.

అయితే విద్యుత్ రంగంలో కొరతను అధిగమించటానికి కొన్ని ప్రయివేటు సంస్థలతో అధిక ధరలకు పిపిఏలు చేసుకోవటం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో ఒప్పందం, కొన్ని సార్లు స్పాట్ మార్కెట్లో కూడా అధిక ధరలకు విద్యుత్ ను కొనుగోలు చేయటం రాష్ట్ర ప్రజలపై కొంత విద్యుత్ ధరల భారాన్ని మోపాయి.

మెరుగుపడిన శాంతిభద్రతలు


కెసిఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో శాంతి భద్రతలు మెరుగుపరచటానికి ప్రత్యేక దృష్టిని సారించింది. దానికి అనుగుణంగా పోలీసులకు ఆధునిక వాహనాలను అందించటం, నిఘా కెమెరాలు ఏర్పాటు చేయటం, షి-టీమ్స్ ను ఏర్పాటు చేయటం వంటి చర్యలను చేపట్టింది. ట్రాఫిక్ విభాగంలో కూడా కొంతవరకు సంస్కరణలు జరిగాయి. ఎక్కడపడితే అక్కడ ఆపి వసూళ్లు చేయటం తగ్గి, ఇంటికే చలాన్లు పంపటం ప్రారంభించటం కూడా మంచి పరిణామమే.

హైదరాబాద్ ఇమేజ్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ప్రాభవం తగ్గుతుందని విపరీతమైన ప్రచారం జరిగింది. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలలో కూడా అభివృద్ధి మందగిస్తుందనే వాదనలు వినిపించాయి. అయితే ఆ దుష్ప్రచారాలన్నింటికీ చెక్ పెడుతూ ఈ రెండు రంగాలలో నాలుగేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికంటే ఎక్కువ శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఐటీ శాఖా మంత్రి కెటిఆర్ ఐటీ సంస్థలకు, ఉద్యోగులకు, ప్రజలకు నమ్మకాన్ని కలిగించగలిగారు. రోడ్ల పరిస్థితి మెరుగుపడకపోవటం, ఇతర కొన్ని మౌలిక వసతుల సమస్యలు ఉన్నప్పటికీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీగా తమ ప్రాభవాన్ని మరింతగా పెంచుకుంది.ఇదే సమయంలో బెంగళూరు నగరం విద్యుత్ కోతలు, నీటి సమస్య మరియు కొన్ని సార్లు శాంతి భద్రతల సమస్యలతో సతమతమవగా, హైదరాబాద్ మాత్రం అటువంటి సమస్యలు లేని నగరంగా పేరుతెచ్చుకుంది. 

నీటిపారుదల ప్రాజెక్టులు


తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత నీటిపారుదల రంగంలో భారీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించింది. అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను వేగవంతం చేయటం, కొత్త ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా గ్రామీణ నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరచటం వంటి చర్యలు చేపట్టారు. వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. కొనసాగుతున్న ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి చేయగలరనే నమ్మకాన్ని కూడా ప్రజలకు కలిగించగలిగారు. 

తెలంగాణాలో, మహారాష్ట్రలో మరియు కేంద్రంలో వేరు వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ  అవగాహనా ఒప్పందాలు కుదరటం, ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగటం మంచి పరిణామమే. ఇక్కడ కూడా మిషన్ కాకతీయపైనా, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైనా కొంతవరకు అవినీతి ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం కోసం మరియు మరింత నీటి లభ్యత కోసం రీడిజైనింగ్ చేసాము అనేది ఇక్కడ ప్రభుత్వ వాదనగా ఉంది.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు కళలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ భాషకు కూడా వాడుకలో, మీడియాలో, ఇతరత్రా గుర్తింపు లభించింది.  తెలంగాణ  పాటకు, గిరిజన నృత్యాలకు, హస్త కళలకు మరియు కళాకారులకు మరింత మన్నన దక్కింది. బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, మీలాద్-ఉన్-నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలకు, పుష్కరాల సమయంలో ఈ ప్రాంతంలోని ఘాట్ లకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించింది. దేవాలయాలు, ఇతర దర్శనీయ స్థలాలను కూడా ఎక్కువ గుర్తింపు, ప్రభుత్వ నిధులు లభించాయి.

రైతు సంక్షేమం


ఎక్కువశాతం నీటి కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. నిరంతరాయ విద్యుత్ సరఫరాతో వారిని ఆకట్టుకోగలిగారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టులపై దృష్టి ద్వారా వారిని ఆకట్టుకోగలిగినప్పటికీ నీటి సౌలభ్యం ఇంకా ఘనణీయంగా మెరుగుపడవలసి ఉంది. రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగుకోసం మద్ధతును అందించటం, భీమా కల్పించటం రైతులను ఆకట్టుకుంది.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలలో ప్రభుత్వానికి మంచి పేరునే సంపాదించి పెట్టాయి. మొదట్లో ఆడపిల్లల పెళ్ళికి 50వేల సహాయాన్ని చేసిన ప్రభుత్వం తరువాత కాలంలో లక్ష రూపాయలకు పెంచింది. అలాగే కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన ఈ పథకాలను అన్ని సామాజిక వర్గాలకు విస్తరించింది.

భిక్షగాళ్లు


హైద్రాబాదులో భిక్షగాళ్లను నిర్మూలించటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున వసతి గృహాలలో వారికి ఆవాసం కల్పించటం, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ వంటి చర్యల ద్వారా కొంతవరకు ఫలితాలు కనిపించాయి. అయితే ఈ చర్యలను పకడ్బందీగా దీర్ఘకాలం కొసాగిస్తే బాగుంటుంది. ఇప్పటికీ అక్కడక్కడా  భిక్షగాళ్లు కనిపిస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు భిక్షమెత్తటం తగ్గి పోవటం, భిక్షమెత్తటంపై ప్రజలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసు యంత్రాంగం స్పందిస్తుండటం సానుకూల అంశాలే.

ఓటుకు నోటు కేసు 


ఓటుకు నోటు కేసు కూడా కెసిఆర్ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచింది. ఈ సంఘటన తరువాతే చీటికీ మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గొడవపడటం తగ్గిపోయింది. రాజకీయంగా, పాలనాపరంగా పైచేయి సాధించటానికి దోహదపడిన దీనిని కెసిఆర్  ప్రభుత్వ విజయంగా చెప్పుకోవచ్చు. 

కొన్ని అంశాలలో ప్రభుత్వం విజయం సాధించిందని గానీ, అలాగే వైఫల్యం చెందిందని కూడా చెప్పలేము. ఇలాంటి వాటిని తటస్థం కింద తెలుపవచ్చు. అలాంటివి ఈ విభాగంలో......

రాష్ట్ర రుణభారం


కెసిఆర్ ప్రభుత్వ హయాములో రాష్ట్ర రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. అయితే ఈ స్థాయిలో అప్పులు పెరిగినప్పటికీ వాటిలో ఎక్కువ శాతాన్ని పెట్టుబడులుగా ఉపయోగించటం గమనార్హం. కొత్తగా భారీ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికీ, నీటి పారుదల రంగంలోని ప్రాజెక్టుల కోసమే ఎక్కువ రుణాలు తెచ్చారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి 70వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఋణం, 2018 నాటికి 1.8 లక్షల కోట్లకు చేరింది. అయితే ఇది విజయమో, వైఫల్యమో భవిష్యత్తే నిర్ణయించనుంది.

ప్రభుత్వ వైద్యం


కెసిఆర్ ప్రభుత్వ హయాములో వైద్యం విషయంలో ఆయన ప్రవచించిన విప్లవాత్మక మార్పులు రాకున్నా, కొంత వరకు  ప్రభుత్వ ఆసుపత్రుల వసతులలో, పని తీరులో మెరుగుదల కనిపించింది. అక్కడక్కడా లోపాలున్నా ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోవటం భారీగా పెరిగింది. ఇతరత్రా వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాలలో కొంతవరకు ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించటం ప్రారంభించారు. ఈ మధ్యే ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పథకం కూడా ఆదరణను చూరగొంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, నేతలు కూడా ప్రభుత్వ సేవలు ఉపయోగించేలా చేసినప్పుడే ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఉపయోగించని వర్గాలనుండి కూడా మరింత ఆదరణ దక్కుతుంది. 

అంగన్వాడీలు


కెసిఆర్ ప్రభుత్వం అంగన్వాడీలకు ప్రత్యేక భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.  నామ మాత్ర జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్న అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు జీతాలను పెంచటం మంచి పరిణామమే. అయితే  అంగన్వాడీ వ్యవస్థ  పనితీరులో అయితే పెద్దగా మార్పులు లేవు.

సంక్షేమ పథకాలు


తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం కొత్తగా కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వీటిలో గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ చేయటం లాంటివి ఉన్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెట్టి, భారీ ఎత్తున ఖర్చు చేసినప్పటికీ వీటిని ప్రవేశ పెట్టిన ఉద్దేశ్యాలకు ఆమడ దూరంలో నిలిచాయి. రాష్ట్రంలో చేపలు, మాసం మరియు పాల లభ్యత చేసిన వ్యయంతో పోలిస్తే పది శాతమైనా మెరుగుపడింది లేదు.

పెన్షన్లు


ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే ప్రభుత్వం ఆసరా ఫింఛనును వేయి రూపాయలకు పెంచింది. తెలంగాణలో వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్  ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.

తెలంగాణకు హరితహారం


తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరిట ప్రతియేటా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే వాటి సంరక్షణ పట్ల ఆ స్థాయి శ్రద్ధ లేకపోవటం వలన నాటిన మొక్కలలో కొన్ని మాత్రమే మనగలుగుతున్నాయి.

ఇక తెలంగాణా ప్రభుత్వ వైఫల్యాల గురించి...

ఉద్యోగాలు


నిధులు, నీళ్లు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం సాగింది. అయితే నిధులు, నీళ్ల విషయాలలో సంతృప్తికరంగా వ్యవహరించిన కెసిఆర్ ప్రభుత్వం నియామకాల విషయంలో ఉద్యోగార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయిదు సంవత్సరాల కాలంలో పెద్దగా ఉద్యోగ భర్తీ జరగలేదు. కొన్ని పోలీసు ఉద్యోగ నియామకాలు, మరికొన్ని ఇతర చిన్న ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగింది. ఈ విషయంలో మాత్రం యువత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది.

గృహ నిర్మాణం


అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం అని ఎన్నికల సందర్భంగా కెసిఆర్, ఇతర టిఆర్ఎస్ శ్రేణులు ప్రచారంతో హోరెత్తించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పరిమితంగా, అదీ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలోనే నిర్మించటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో సహాయం పరిమితంగా ఉన్నా అడిగిన వారందరికీ ఇల్లు మంజూరు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వ హయాములో మెజారిటీ గ్రామాలలో కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మింపబడలేదు. ఐదు లక్షల రూపాయలతో  డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించటం కష్టం అని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసినా, వారికి ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తామని డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టులు అంటగట్టడం అవినీతిని ప్రోత్సహించటం కిందకే వస్తుంది. ఏది ఏమైనా అస్తవ్యస్త విధానాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 

ప్రభుత్వ విద్య


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు చేసిన ప్రసంగాల ద్వారా, మేనిఫెస్టో ద్వారా అధికారంలోకి రాగానే  ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఆశలు కల్పించారు. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య, ప్రభుత్వ స్కూళ్లలోనే చదివేలా ప్రోత్సహించటం లాంటి హామీలు వీటిలో ఉన్నాయి. ఫీజు రి-ఇంబర్సుమెంట్ పథకానికి ఖర్చు చేసే డబ్బులో కొంత శాతంతోనే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల ప్రమాణాలు మెరుగుపడగలవని ఆయన అనేక సభలలో ప్రసంగించారు. కానీ నాణ్యతా ప్రమాణాలు లేవని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలను మూసివేయటం మినహా ఈ రంగంలో పెద్దగా చేసిందేమీ లేదు. ప్రభుత్వ అధ్యాపకుల జీతాలు విపరీతంగా పెరగటం మినహా స్కూళ్లలో విద్య మెరుగుపడిందేమీ లేదు. అధ్యాపకుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోకపోవటమే దీనికి నిదర్శనం.

మిషన్ భగీరథ 


తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికీ మంచినీరు అందించే సదుద్ధేశ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో పథకం మిషన్ భగీరథ. ఈ పథకంలో భాగంగా ప్రతీ గ్రామానికి అంతవరకూ ఉన్న మంచినీరు అందించే వ్యవస్థలను నిర్లక్ష్యం చేసారు. అవసరమైన కెపాసిటీతో అప్పటికే పైప్ లైన్లు, నిల్వ వ్యవస్థలు ఉన్నా వాటి పక్కనే మళ్ళీ భారీ ఖర్చుతో కొత్తగా ఏర్పాటు చేసారు. అప్పటికే ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే సమయం, ఖర్చు కలసి వచ్చేవి. ప్రభుత్వమే ఇలా చేయటం భారీ అవినీతి జరుగుతుందనే  సందేహాలకు తావిచ్చింది. పూర్తయిన చోట్ల కూడా పదే పదే పైప్ లైన్ లీకేజీలు జరగటం పనుల నాణ్యతపై విమర్శలు ఎదుర్కొనేలా చేసాయి. ఐటీ శాఖ ద్వారా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న కెటిఆర్ మిషన్ భగీరథ విషయంలో విఫలమయ్యారనే భావించవచ్చు.   

కులాలవారీ పథకాలు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణాలో కులాల వారీ విభజన, విద్వేషాలు తక్కువ. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  కులాల వారీ పథకాలు ప్రవేశ పెట్టడం, భవనాలు నిర్మించటం పెరిగింది. గత పదినుండి ఇరవై సంవత్సరాలుగానే తెలంగాణాలో ఈ తరహా సంఘాలు, వ్యవస్థ వేళ్లూనుకోవటం ప్రారంభించింది. కెసిఆర్ దానికి ఆజ్యం పోసారు.  

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 


తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు విపరీతంగా పెరిగాయి కానీ వారిలో కనీసస్థాయి జవాబుదారీతనం పెరగలేదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగితే వారు అవినీతికి పాల్పడరని కెసిఆర్ గారు ప్రారంభంలో పదే పదే చెప్పేవారు. కానీ వాస్తవానికి దానికి విరుద్ధంగా జరిగింది. అప్పటివరకు వంద రూపాయలు ఆశించే పనులకు కూడా వారు  ఐదువందలు అడగటం ప్రారంభించారు. ఉద్యోగులకు ప్రజలకు మధ్య సామాజిక విభజన మరింతగా పెరిగింది. ఉద్యోగులు తమని తాము ప్రజలకన్నా మరింత ఉన్నత శ్రేణికి చెందినవారిగా భావించటం ప్రారంభించారు. అవినీతి, నిర్లక్ష్యం, సామాన్య ప్రజలను గౌరవించి మాట్లాడకపోవటం లాంటివి వారి లక్షణాలుగా మారిపోయాయి.      

అంతా తామే అన్నట్లుగా వ్యవహరించటం 


కెసిఆర్ గారు కొన్నిసార్లు అతిశయంతో వ్యవస్థల పరిధులను దాటి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన కింద విచక్షణతో ఖర్చు చేయవలసిన నిధులు ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక పూట తిండికి కష్టపడుతున్నవారు, చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా చికిత్స చేయించుకోలేనివారు, కనీస విద్యకు నోచుకోనివారు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో లక్షలకు లక్షలు పైలట్ ట్రైనింగుల పేరిట, విదేశాలలో విద్యల పేరిట మంజూరు చేయటం ఎటువంటి విచక్షణో అర్థం చేసుకోలేము. ఆ స్థాయి వారికి సహాయం చేయాలనుకుంటే, మళ్ళీ కట్టగలిగే సామర్థ్యం వస్తుంది కాబట్టి రుణ సహాయం చేయవచ్చు. కానీ అమూల్యమైన ప్రజల సొమ్మును ఉచితంగా ఇవ్వటం సరికాదు. 

కెటిఆర్ గారికి కూడా ట్విట్టర్లో రోజూ కొన్ని పదుల సంఖ్యలో సహాయం కోసం విన్నపాలు వస్తుంటాయి. వాటిలో ఒకటో రెండో విన్నపాలకు ఆయన స్పందిస్తారు. అటువంటి వాటికి వ్యక్తిగత స్థాయిలో స్పందించటం కన్నా ప్రభుత్వ స్థాయిలో ఒక పూర్తి స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే మరింత మందికి సహాయం కల్పించవచ్చు. కెటిఆర్ గారు ట్విట్టర్లో స్పందించి సహాయం చేసారని మీడియాలో వచ్చే వార్త ఆయనకు గొప్పగా ఉండవచ్చు. కానీ  వ్యవస్థ విఫలమైనందువలనే వ్యక్తిగత సహాయం కోసం ఆయనను అభ్యర్థిస్తున్నారనేది గుర్తించాలి.   

0/Post a Comment/Comments

Previous Post Next Post