కెసిఆర్ తెలంగాణాలో తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను వదిలి, చంద్రబాబునే ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోవటం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా?, ఒకసారి ఇటీవలి ప్రసంగాలలో చంద్రబాబునాయుడి గారిపై కెసిఆర్ చేసిన విమర్శలు పరిశీలించండి.
మోడీతో కలిసింది ఎవరు? మోడీ తో పొత్తు పెట్టుకుని కేంద్రంలో అధికారం అనుభవించింది చంద్రబాబు. మోడీ కాళ్ళు మొక్కి మన 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు. కరెంటు కోసం తెలంగాణ గోస పడుతుంటే సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకుని రాక్షసానందం పొందాడు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపడానికి కేంద్రానికి 36 లేఖలు రాసిన వాడితో ఇక్కడ కాంగ్రెస్‌కు పొత్తా?
టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, తెలంగాణ సమాజం గానీ ఆంధ్రవాళ్లపై ఎప్పుడూ వివక్ష చూపలేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్లకు పట్టిన శని. అన్నదమ్ముళ్లలాగా ఉండాల్సిన ఇక్కడి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడతావా చంద్రబాబు? తెలంగాణ వస్తే టీఆర్ఎస్ వాళ్లు ఇక్కడి ఆంధ్రా వాళ్ళని తరిమి కొడతారని చంద్రబాబు లాంటి నేతలు దుష్ప్రచారం చేశారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణాలో ఉన్నవాళ్లు తెలంగాణా వాళ్ళే కానీ ఆంధ్రా వాళ్ళు కాదు.
ఇక్కడి రాజకీయాలలో అనవసరంగా జోక్యం చేసుకుని ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయావు. ఇంకా సిగ్గు రాలేదా? ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో నీ మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ నువ్వు అమలు చేయలేదు, అక్కడ సక్కదనం లేదు గానీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నీ విమర్శలు అవసరమా?
పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, కాంగ్రెస్ - టిడిపిలు అధికారంలోకి వస్తే అధికారం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారు. చిన్న చిన్న నిర్ణయాలకు కూడా ఢిల్లీ వైపు, అమరావతి వైపు చూడాల్సి వస్తుంది.
ఈ విధంగా ప్రసంగాలలో కెసిఆర్ కాంగ్రెస్‌ను ప్రస్తావించినప్పటికీ, విమర్శలన్నీ చంద్రబాబునే లక్ష్యం చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్ళీ తెలంగాణ స్వయంపాలన సెంటిమెంట్‌ను, భావోద్వేగాలను రగిల్చే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన ఈ విధంగా ప్రసంగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరస్పర విరుద్ధమైన ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తీసుకునే కొన్ని నిర్ణయాలు తెలంగాణ వ్యతిరేకంగా ఉండటం సహజం.
మహాకూటమి Vs టిఆర్ఎస్‌ల మధ్య జరగాల్సిన ఎన్నికలను చంద్రబాబు Vs కెసిఆర్‌గా చూపించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్‌లో ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిగా చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవటం కూడా కెసిఆర్‌కు మరింత కలసి వచ్చింది. తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, కెసిఆర్‌కు మధ్య జరిగే ఎన్నికగా భావిస్తే, ఆయన లక్ష్యం నెరవేరినట్లే.
Post a Comment