కాంగ్రెస్, టిడిపి, జనసమితి మరియు సిపిఐలు జట్టుగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. సీట్ల సంఖ్యపై అన్ని వర్గాలు పట్టుదలగా ఉండటంతో పంపిణీ క్లిష్టంగా మారింది. గత కొన్ని రోజులుగా కూటమి నుండి ఎటువంటి అధికారిక ప్రకటనలు బయటకు రాకపోవటంతో వివిధ రకాల వదంతులు వినవస్తున్నాయి.
మహాకూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కనీసం 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా తెలంగాణ జనసమితి 25 స్థానాలను ప్రతిపాదించగా, టిడిపి 20 స్థానాలను, సిపిఐ 5 స్థానాలను అడిగింది. జనసమితి ఉద్యమ ప్రభావం బలంగా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లను కేటాయిస్తామని ప్రతిపాదించగా జనసమితి కనీసం 12 స్థానాలపై పట్టుపడుతోంది. టిడిపి హైదరాబాద్ నగరంపై, సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఇతర స్థానాలపై తమ దృష్టిని కేంద్రీకరించింది. టిడిపికి సంబంధించిన పొత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఒకటి, రెండు అటూ ఇటుగా దాదాపు 15 సీట్లుకు ఖరారయ్యాయి. ఇక సిపిఐకి 3 స్థానాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఇంటి పార్టీకి కూడా ఒక సీటు కేటాయించనున్నారు. జనసమితి సీట్ల విషయం తేలితే వీటిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో చర్చలు సఫలం కాకపోవటంతో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని సీట్ల విషయంలో చర్చిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాగా కోదండరాం గారికి మహాకూటమి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించినట్లు, రాజ్యసభ సీటును ఇచ్చినట్లు వచ్చిన వదంతులను జనసమితి అధికారికంగా ఖండించింది.
చాలావరకు నియోజకవర్గాలలో టిఆర్ఎస్ అభ్యర్థులు ఖరారవడంతో వారు ప్రచారం చేసుకుంటున్నారు. మహాకూటమి అభ్యర్థుల విషయంలో గందరగోళం నెలకొనటంతో కొన్ని స్థానాలలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ప్రచారం చేసుకుంటుండగా, కొన్ని స్థానాలలో మాత్రం స్తబ్దత నెలకొంది.
Post a Comment