ఆశలకు, ఆశయాలకు మధ్య ఊగిసలాటలో జనసమితి

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ - తెలంగాణ ఉద్యమంలో జాయింట్ ఏక్షన్ కమిటీ చైర్మన్ గా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమం జరిగితే ఇతర పార్టీల నేతలు కలిసి రావటం కష్టమని ఈ జెఏసి ఏర్పాటు చేయటం జరిగింది. రాజకీయ పార్టీలే కాక కెసిఆర్ తో మనలేని అనేక ఇతర వర్గాలు, కోదండరామ్ మూలంగానే ఉద్యమంలో మమేకమయ్యాయి. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి అనేక కార్యక్రమాలతో ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చింది ఆయనే. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న కోదండరామ్ గారు, జయశంకర్ గారి తరువాత తెలంగాణ ప్రజానీకం చేత 'సార్' అని పిలిపించుకున్న వ్యక్తి.   

తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ గారు రాజకీయాలలోకి రావటానికి ఇష్టపడలేదు. తెలంగాణ జెఏసిని ప్రజా వేదికగా మార్చి ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వానికి విధాన పరమైన విషయాలలో నిపుణుల చేత సూచనలు ఇప్పించాలని, ప్రభుత్వంలో జరిగే అవినీతిని, అసమగ్ర విధానాలను ప్రశ్నించాలని భావించారు. అయితే ఏ ప్రభుత్వానికి బయటి వ్యక్తి  సూచనలు తీసుకోవటం, ప్రశ్నింపబడటం నచ్చదు. కెసిఆర్ వంటి ఒంటెత్తు పోకడలు పోయేవారికి అయితే అసలే నచ్చదు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా జెఏసిని సమావేశపరుస్తుండటం, ఉద్యోగాలు కల్పించకపోవడంపై గళమెత్తటం, తరచుగా ఇతర సమస్యలను కూడా ప్రస్తావించటం వంటివి కెసిఆర్ మరియు కోదండరాంల మధ్య అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలను సన్నగిల్లేలా చేసాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం విజయం సాధించిన తరువాత మీడియా సమావేశంలో కోదండరామ్ గారిని కెసిఆర్ దమ్ముంటే పార్టీ పెట్టాలని, నానామాటలు అనటంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

ఆ తరువాత కూడా కోదండరామ్ గారు పార్టీ పెట్టడానికి పెద్దగా ఇష్టపడలేదు. చివరకు ఈ సంవత్సరం మార్ఛి 31న జెఏసిలోని ఇతర ముఖ్యులతో కలిసి తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన 'సార్', రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎంతమేర తన ప్రభావం చూపించబోతున్నారు? అనేది ఒకసారి పరిశీలిద్దాం.  

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిలో కొన్ని వర్గాలు ఇప్పటికీ కెసిఆర్ గారి కంటే కోదండరాం గారినే ఎక్కువ విశ్వసిస్తాయి మరియు గౌరవిస్తాయి. ఉద్యమంలో పాల్గొన్న మేధావి వర్గంలో, విద్యార్థులలో ఇటువంటి వారు మరీ ఎక్కువ. అయితే వారికి కూడా కోదండరామ్ ఈ ఎన్నికల బరిలో నిలిచిన తీరుపట్ల, పెట్టుకుంటున్న పొత్తుల పట్ల అనేక సంశయాలు కలుగుతున్నాయి. ఎన్నికలలో భాగంగా పొత్తులు పెట్టుకోవటం సహజమే. కానీ మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ,  తెలంగాణ బద్ధ వ్యతిరేకిగా పేరొందిన తెలుగుదేశం పార్టీలతో కూటమి కట్టడమే ఈ అనుమానాలకు మూల కారణం. వీటివలన ప్రజల ఆకాంక్షల కోసమే పోరాడుతానన్న 'సార్' లక్ష్యం ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించడం మీదనే కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ మహాకూటమి అధికారంలోకి వచ్చినా అక్కడ 'సార్' మాట చెల్లుబాటవటం కష్టమే.  

ప్రస్తుత రాజకీయ వాతావరణం కోదండరాం గారికి గానీ, ఆయన నేతృత్వంలోని తెలంగాణ జనసమితికి గానీ ఏమాత్రం అనుకూలంగా లేదు. 'తెలంగాణ పరిరక్షణ వేదిక' పేరుతో కాంగ్రెస్, టిడిపిలతో కలిసి ఏర్పాటు చేస్తున్న కూటమిలో ఆయన వలన కాంగ్రెస్ పార్టీ ఏమైనా లాభపడవచ్చు గానీ ఆయనకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. 2014 సమయంలోనే ఎన్నికల బరిలోకి దిగి ఉంటే ఆయన కొంతవరకు సానుకూల ఫలితాలు సాధించేవారనే భావన ఉంది.   

ఉద్యమ సమయంలో కెసిఆర్ గారి కన్నా ఎక్కువ విశ్వసనీయత ఉన్న కోదండరామ్ గారి పార్టీకి మహా కూటమిలో 5-10 సీట్లు దక్కడం కూడా కష్టమే. ఏవి కేటాయిస్తారో, ఎన్ని కేటాయిస్తారో అనేది కూడా కాంగ్రెస్ పార్టీ  చేతుల్లోనే ఉంది. ఆయన ఎక్కడ నుండి ఎన్నికల బరిలోకి దిగాలన్నది కూడా ఆయన కాకుండా కూటమే నిర్ణయించవలసిన నిరాశామయ పరిస్థితులలో ఉన్నారు. ఎన్నికలలో ఆయన రాష్ట్రంలోని కొన్ని వర్గాలను ప్రభావితం చేయగలిగే పరిస్థితులలో ఉన్నా, తెలంగాణ జన సమితి పరిమిత సంఖ్యలో సీట్లను గెలవవచ్చు లేదా అసలు ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు. ఒకసారి సీట్ల కేటాయింపు జరిగి పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చిన తరువాత విజయావకాశాలపై మరొకసారి విశ్లేషిద్దాం. ప్రస్తుతానికి మాత్రం ప్రజల మరియు ఉద్యమ ఆకాంక్షలు అనే ఆశయాలకూ, రాజకీయ ఆశలకూ మధ్య ఊగిసలాటలో తెలంగాణ జన సమితి ఉందని చెప్పవచ్చు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post