షింకాన్ సేన్ సంస్థకు చెందిన E5 శ్రేణి రైలు |
మన దేశంలో పూణే- ముంబయి- అహ్మదాబాద్ నగరాల మధ్య 508 కిలోమీటర్ల దూరానికి 2022లో హై-స్పీడ్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. 15 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 1.1 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో, జపాన్ సాంకేతిక సహకారంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు 81శాతాన్ని జైకా (JICA) ఋణంగా సమకూరుస్తుంది.
ఈ ప్రాజెక్టుకు మనదేశంలో మొదటి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుగా విస్తృతంగా ప్రచారం లభించింది. జపనీస్ బుల్లెట్ ట్రెయిన్ అనగానే సాధారణంగా అందరికీ పట్టాలకు కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మాగ్లేవ్ రైళ్లే గుర్తుకువస్తాయి. కానీ మన దేశంలో నిర్మితమవుతున్న కారిడార్లో షింకాన్ సేన్ సంస్థకు చెందిన E5 శ్రేణి రైళ్లను ఎన్నుకున్నారు. ఇవి పట్టాలపైనే నడుస్తాయి. 2009లో తయారయిన ఈ తరహా రైళ్లు జపాన్లో 2011 నుండి ఉపయోగించబడుతున్నాయి. వీటి గరిష్ఠ వేగం గంటకు 320 కిమీ (200 మైళ్ళు).
మాగ్లేవ్ రైళ్లు 500 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలిగినా, అవి అన్ని దేశాల్లో తక్కువ దూరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇంత ఎక్కువ దూరానికి వాటిని నిర్మించిన, ఉపయోగించిన సందర్భాలు లేవు. అంతేకాకుండా వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇప్పుడు అవుతున్న దాని కన్నా 2-3 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా షింకాన్ సేన్ రైళ్లు భద్రత విషయంలో సాటిలేనివి, ఎక్కువ దూరం ప్రయాణాలకు నిరూపితమయ్యాయి. అందుకే ప్రభుత్వం మాగ్లేవ్ రైళ్లను పరిశీలించినప్పటికీ భద్రత మరియు ఖర్చు దృష్ట్యా వీటినే ఎంపిక చేసింది.
ఇప్పటి వరకు మనదేశంలో నడిచే రైళ్లలో అత్యంత వేగంతో నడిచే రైలు అయిన గతిమాన్ ఎక్స్ ప్రెస్ వేగం గంటకు 160 కిలోమీటర్లు మాత్రమే. అంటే కొత్త కారిడార్లో నడిచే హై-స్పీడ్ ట్రెయిన్ ఇప్పటి వేగవంతమైన రైలు కన్నా రెట్టింపు వేగంతో వెళ్లనుంది. చైనా ప్రతిపాదించిన గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఫ్లయిట్ ట్రెయిన్ మాగ్లేవ్ టెక్నాలజీపై రూపొందనుంది.
Post a Comment