తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలు జనరంజకంగా ఉన్నాయి. ఆయన ఈ హామీలను ప్రకటించటానికి భారీ కసరత్తు చేసినట్లు కనిపిస్తుంది.
టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హామీల అమలు తీరుపై కొంతమంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఆశలు పెట్టుకున్నవారు, భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశించిన వారు నిరాశకు గురైన వారిలో ఉన్నారు. వీరిని ఆకట్టుకోవటానికి ఏటా రెండు లక్షల ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇవ్వటంతో పాటు, స్వంత భూమిని కలిగి ఉన్నవారికి వారే నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే ఉద్యోగ ప్రకటనలపై హామీ ఇవ్వకున్నా ప్రతీ నిరుద్యోగికీ నెలకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని కూడా పేర్కొన్నారు.
రైతుల కోసం ఇప్పటికే అమలులో ఉన్న రైతుబంధు పథకంలో భాగంగా ఏడాదికి ఎకరాకు ఇచ్చే సహాయాన్ని ఎనిమిది వేలనుండి పది వేలకు పెంచారు. అలాగే ఒక లక్ష రూపాయల వరకు రుణ మాఫీని, అనుభవం వచ్చింది కాబట్టి తక్కువ విడతలలో చేస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్ల వయః పరిమితిని వృద్ధులకు 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు తగ్గించటంతో పాటు ఇచ్చే మొత్తాన్ని కూడా రెండింతలు చేసారు. అయితే ఈ వర్గాలు కెసిఆర్ ప్రభుత్వంపై సంతృప్తితోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆకర్షణీయమైన హామీలకు అటువైపు మొగ్గకుండా ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఇవే కాక ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అగ్రవర్ణాలైన రెడ్డి, ఆర్య వైశ్య కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ భృతిని కూడా కెసిఆర్ మనసు మార్చుకుని హామీగా ప్రకటించటం విశేషం. ఆయన గతంలో నిరుద్యోగ భృతి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించటంతో పాటు, ఎంత మందికి భృతి ఇస్తారు? అసలు నిరుద్యోగుల లెక్కలు ఉన్నాయా? అని మీడియాతో అన్నారు. అయితే ఈ హామీలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, తమ మ్యానిఫెస్టోను కాపీ కొట్టారని ఆరోపించటంతో పాటు నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా ఇప్పుడు హామీలు ఇవ్వటమేమిటని తీవ్ర విమర్శలు చేసింది.
Post a Comment