అనంత పద్మనాభ వ్రత కథ

Story of Ananta Padmanabha Vratha
సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు ఉపదేశించుట 
సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు ఇట్లు చెప్పసాగాడు. పూర్వం ధర్మరాజు తన సోదరులతో గూడి అరణ్యవాసం చేసి అనేక కష్టములను ఎదుర్కొన్నాడు. ఒకనాడు ఆయన శ్రీకృష్ణుడితో మాధవా! మేము అరణ్యవాసం చేస్తూ దుఃఖంలో ఉన్నాము. ఈ కష్టాలు కడతేరటానికి ఉపాయాన్ని తెలుపమని కోరగా దానికి ఆ గోపాలుడు ధర్మరాజా! జీవులందరి సర్వ చింతలను పోగొట్టి వారికి శాంతిని యశస్సును కలిగించే వ్రతముంది. అది భాద్రపద శుక్ల చతుర్దశి రోజున ఆచరించే అనంత పద్మనాభ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖ సౌఖ్యాలు, యశస్సు, సంతాన ప్రాప్తి కలుగుతాయని అన్నాడు.

ఇది వినిన ఆ కుంతీ పుత్రుడు, ఓ దేవ దేవా! అనంత పద్మనాభుడు ఎవరు? అని ప్రశ్నించగా, శ్రీకృష్ణుడు అనంతుడనగా నేనే! సూర్యగమనం వలన ఏర్పడే తిథులు, నక్షత్రాలు, పగలు, రాత్రి, ఋతువులు, మాసములు, దినములు అన్నీ నా స్వరూపమే. నేనే కాల స్వరూపుడను. భూభారం తగ్గించడానికి అనంతుని పేర దేవకీ, వసుదేవుల ఇంట జన్మించాను. నన్ను విష్ణువుగానూ, కృష్ణుడిగానూ, హరిహరుడిగానూ, బ్రహ్మగానూ, అనంత పద్మనాభుడిగానూ, సృష్టి-స్థితి-లయ కారుడిగానూ తెలుసుకొమ్మని వివరిస్తూ నా హృదయములో పదునాలుగు మంది ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తఋషులు మరియు త్రిలోకాలు ఉన్నాయని వివరించాడు.

అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ అనంత పద్మనాభ వ్రతము ఎలా ఆచరించాలి? వ్రతఫలము ఏమిటి? పూర్వము ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించారు? తెలుపమని కోరగా ఆ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.

కృతయుగంలో సుమంతుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య దీక్షాదేవి భృగు మహర్షి పుత్రిక. వారికి శీల అనే కుమార్తె జన్మించినది. అయితే కుమార్తె జననము తరువాత దీక్షాదేవి మరణించినది. సుమంతుడు వైదిక కర్మలను, విధులను నిర్వహించేందుకు అర్హతను పొందటానికి కర్కశ అనే కన్యను పునర్వివాహమాడాడు. ఆమె కఠిన హృదయురాలు, గయ్యాళి. సుమంతుని పుత్రిక శీల పెరిగి, పెద్దదవుతూ జ్ఞాన బుద్ధులతో దైవ భక్తి పరాయణురాలై శ్రీహరిని నిష్ఠతో కొలుస్తూ ఉండేది. ఒకసారి కౌండిన్య మహాముని దేశాటన చేస్తూ, సుమంతుని గృహానికి వెళ్ళాడు. అక్కడ శీలాదేవిని వివాహమాడాడు. కొద్ధి రోజుల పాటు అక్కడే ఉన్న తరువాత కౌండిన్యుడు భార్యా సమేతంగా స్వగృహానికి బయలుదేరాడు. అత్తగారింటికి వెళ్లే కుమార్తెకు ఏదైనా బహుమానం ఇవ్వాలని సుమంతుడు భార్యను కోరగా, ఆవిడ ఇంట్లో ఏమీ లేవు అన్నది. ఆయన విధి లేక పెళ్ళిలో మిగిలిన సత్తుపిండిని మూటగట్టి కుమార్తెకు ఇచ్చి సాగనంపాడు. మార్గ మధ్యములో కౌండిన్యుడు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళాడు. ఆరోజు అనంత పద్మనాభ చతుర్దశి. ఒక చోట స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని పద్మనాభ స్వామిని కొలుస్తూ ఉండగా, శీలాదేవి వారివద్దకు వెళ్లి వివరాలు అడిగింది.  అప్పుడు ఆ స్త్రీలు, తాము అనంత పద్మనాభ వ్రతము ఆచరిస్తున్నామని, దీనివలన విలువ కట్టలేనంత ఫలము కలుగుతుందని  తెలిపారు. అప్పుడు శీలాదేవి దీనిని ఎప్పుడు, ఎలా ఆచరించాలి అని ప్రశ్నించగా వారు దీనిని భాద్రపద శుక్ల చతుర్దశినాడు నదీ తీరమునకు వెళ్లి స్నానము చేసి, ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అలికి, తామర పుష్పము వంటి మండపము నిర్మించాలి. మండపాన్ని ముగ్గులతో మరియు తోరణములతో  అలంకరించి, వేదికపైన దక్షిణం వైపున కలశమును ప్రతిష్టించి, వేదిక నడుమ దర్భతో తీర్చి,

కృత్వా దర్భమయం దేవం శ్వేతదీపే స్థిరం హరిమ్|
సమన్వితం సప్తఫణైః  పింగళాక్షం చతుర్భుజం||

అనే శ్లోకాన్ని పఠించి, దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, పదునాలుగు ముడులు కలిగిన పసుపు కుంకుమలతో తడిసిన దారాన్ని స్వామి ముంగిట ఉంచి, 28 అరిసెలు స్వామికి నైవేద్యంగా పెట్టి, స్వామి ముందు ఉంచిన దారాన్ని చేతికి కట్టుకుని వ్రతమాచరించాలి. వ్రత సామగ్రిని సాధ్యమైనంత వరకు 14 సంఖ్యలో ఉంచాలి. అని వారు తెలిపారు.

వారు తెలిపిన వివరాలు విన్న కౌండిన్య మహర్షి సతీమణి శీలాదేవి, వెంటనే నదికి వెళ్లి స్నానం చేసి, వ్రత దారమును ధరించి స్త్రీల సహాయముతో వ్రతమాచరించినది. తండ్రి ఇచ్చిన సత్తు పిండిని బ్రాహ్మణులకు వాయనంగా సమర్పించింది. ఆ తరువాత తన భర్త వెంట ఆశ్రమానికి చేరుకుంది. వ్రత ప్రభావము వలన ఆశ్రమము ధన ధాన్యాలతో తులతూగింది. ఆ దంపతులు సుఖ సంతోషాలతో ప్రతి సంవత్సరం నియమం తప్పక అనంత పద్మనాభ వ్రతమాచరించేవారు. అయితే కౌండిన్యుడు, ఒక రోజు శీలాదేవి ధరించిన నోము దారాన్ని చూసి ఇది ఎప్పుడు కట్టుకున్నావు? ఎవరినైనా వశపరుచుకోవటానికా?  అని దూషించాడు. అప్పుడు ఆమె ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా కట్టుకున్న దారము. ఆ స్వామి దయ వలననే మనకు సిరి సంపదలు కలిగాయి అని అనగా, కౌండిన్యుడు అనంతుడు ఎవరూ అంటూ దూషించి, ఆ దారాన్ని తెంచి అక్కడ మండుతున్న అగ్నిలో వేసాడు. దీనివలన ఆ స్వామికి ఆగ్రహం కలిగి, కొంత కాలములోనే అతని సంపద హరించిపోయింది. అతని ఇల్లు అగ్నికి ఆహుతి అయి అడవులపాలయ్యాడు.

అప్పుడు కౌండిన్యునికి స్వామి జ్ఞాపకం వచ్చి, ఆ దేవుణ్ణి చూడాలని తిరగసాగాడు. అలా తిరుగుతూ కాయలు, ఆకులతో సమృద్ధిగా ఉన్న మామిడి చెట్టును చూసి, దానిపై ఒక్క పక్షి కూడా లేకపోవటంతో ఆశ్చర్యం చెంది ఆ చెట్టుతో ఓ వృక్షమా! అనంత పద్మనాభుని చూసావా? అని అడుగగా, దానికి ఆ చెట్టు నేను చూడలేదు అని అన్నది. అలాగే పచ్చగడ్డిలో ఊరికే నిలుచుని ఉన్న దూడను అడిగాడు. ఒక ఆవును, ఒక ఎద్దును, పుష్కలంగా నీటితో నిండిన రెండు సరస్సులనూ, ఒక గాడిదనూ మరియు ఒక ఏనుగునూ మీరు అనంత పద్మనాభుని చూసారా? అని ప్రశ్నించగా అవి మాకు తెలియదు అని సమాధానమిచ్చాయి. మతిభ్రమించిన వాడివలే అలా తిరిగి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు దయాళువు అయిన స్వామికి భక్తునిపై కృప కలిగి, వృద్ధ బ్రాహ్మణుని రూపములో వచ్చి అతనిని లేపి, చేయి పట్టుకుని ఒక ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆ ఆశ్రమం నవరత్న ఖచితమై, ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంది. అక్కడ శ్రీహరి శంఖ, చక్ర, గదాదారియై, ఆ కౌండిన్యునికి అనంత పద్మనాభ స్వరూపముతో దర్శనమిచ్చాడు. అప్పుడు కౌండిన్యుడు సంతోషంతో శ్రీహరిని వేనోళ్ళ స్తుతించాడు. అప్పుడు ఆ స్వామి తృప్తి చెంది ఓ బ్రాహ్మణోత్తమా! నీ భక్తికి  మెచ్చి నీకు శాశ్వత వైకుంఠప్రాప్తిని కలిగిస్తున్నాను అని దీవించాడు. అప్పుడు కౌండిన్యుడు అడవిలో తాను చూసిన మామిడి చెట్టు ఆవు, ఎద్దు, సరస్సులు, గాడిద, ఏనుగులను గురించి ప్రశ్నించగా దానికి ఆ శ్రీహరి ఆ మామిడి చెట్టు పూర్వం ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు, ఎవ్వరికీ విద్యను బోధించనందువలన ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేని చెట్టుగానూ, దానధర్మాలు చేయని ధనవంతుడు గడ్డిని సరిగ్గా తినలేని ఆవుగానూ, ఉపయోగంలేని భూములను దానం చేసిన రాజు వృషభంగానూ, సాటి వారిని సదా దూషించే వ్యక్తి గాడిదగానూ, పూర్వీకులను విస్మరించిన వ్యక్తి ఏనుగు రూపంలోనూ జన్మించారు. అలాగే ఆ రెండు సరస్సులలో ఒకటి ధర్మం మరొకటి అధర్మం అని వివరించాడు. అలాగే 14 సంవత్సరములపాటు వ్రతమాచరించవలసిందిగా శ్రీహరి అతనిని ఆదేశించి అంతర్ధానమయ్యాడు.

వరము పొందిన కౌండిన్యుడు ఆశ్రమం చేరి, తన భార్యకు జరిగిన విషయాన్ని వివరించి, పదునాలుగు సంవత్సరముల పాటు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి భార్యా సమేతుడై వైకుంఠాన్ని చేరాడు. ఆ మహావిష్ణువు అతనికి ఒక నక్షత్ర స్థానాన్ని కల్పించాడు. అగస్త్యుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి జగత్ ప్రసిద్ధుడయ్యాడు. అలాగే సగర, దిలీప, హరిశ్చంద్ర, భరత మరియు జనక మహారాజులు ఈ వ్రతాన్ని ఆచరించి స్వర్గ సౌఖ్యాలు పొందారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా, సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు తెలిపాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post