ఐ ఫోన్ ఇండియా కష్టాలు

ఐ ఫోన్ ఇండియా కష్టాలు
ఐ ఫోన్ ఇండియా కష్టాలు 
ఆపిల్, ప్రపంచంలో ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి సంస్థగా అవతరించింది. అనేక దేశాల్లో తన ఉత్పత్తులతో మొబైల్ అమ్మకాలలో మొదటి స్థానంలో నిలవటంతో ఈ ఘనత సాధ్యమైంది. అయితే ఈ సంస్థను, ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన మన దేశంలో పెద్దగా ప్రభావం చూపలేకపోవటం కలవరపరుస్తోంది. మన దేశ స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో ఐ ఫోన్ వాటా ఒక శాతం కన్నా తక్కువే. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో మొత్తం ఐ ఫోన్ అమ్మకాలు ఒక మిలియన్ కన్నా తక్కువే. ఇదే సమయంలో షావోమి సంస్థ 19 మిలియన్ల కన్నా ఎక్కువ ఫోన్లు అమ్మటం గమనార్హం. 

ఆపిల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ కూడా వాటాదారుల సమావేశంలో  ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇండియాలో ఐఫోన్ విఫలమవటానికి గల కారణాలను విశ్లేషించి, పనితీరును మెరుగు పరుచుకోవటానికి గత రెండు సంవత్సరాలలో సంస్థ అనేక చర్యలు చేపట్టింది. మనదేశంలోని సంస్థ అధికారులను ఇప్పటికే విజయవంతమైన అధికారులతో భర్తీ చేసారు. సింగపూర్ నుండి మిచెల్ కులాంబ్ ఇండియా చేరుకొని ఇక్కడి పనితీరును పూర్తిస్థాయిలో సమీక్షించారు. అయినప్పటికీ సంస్థ పనితీరులో పెద్దగా పురోగతిని చూపించలేకపోయింది. చాలా ప్రాంతాలలో ఆపిల్ (ఐ) స్టోర్లు కనీసం నిర్వహణ ఖర్చులను కూడా సంపాదించలేకపోతున్నాయి. తాజాగా మనదేశ మార్కెట్ ను ఆకర్షించటానికి సంస్థ డ్యూయల్ సిమ్ ఫోన్ ను ప్రవేశ పెట్టింది. 

అయితే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఐ ఫోన్ మనదేశంలో పెద్దగా ప్రభావం చూపకపోవడం వెనుక సాంకేతిక, ఆర్ధిక కారణాలతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 
  • ఆపిల్ మ్యాప్స్ మనదేశంలో సరిగ్గా పని చేయవు. ఈ మ్యాప్స్ 2020 లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని సంస్థ తెలియచేసింది. ప్రత్యర్థి సంస్థకు చెందిన గూగుల్ మ్యాప్స్ ఎప్పటి నుండో పూర్తిస్థాయి వినియోగంలో ఉన్నాయి. 
  • ఆపిల్ సంస్థకు చెందిన వాయిస్ అప్లికేషన్ సిరి, మనదేశ ఉచ్చారణను, స్థానిక భాషలలో అభ్యర్థనలను సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోతోంది. ఆండ్రాయిడ్ అప్లికేషన్లో కూడా ఈ తరహా సమస్యలున్నప్పటికీ సిరి కన్నా మెరుగే. ఇక ఆపిల్-పే ను కూడా మన దేశంలో వినియోగించలేము. 
  • ఐ ఫోన్ లో ఉచిత అప్లికేషన్లు తక్కువ. ఒకసారి డబ్బులు వెచ్చించి ఫోన్ కొన్న తరువాత మన దేశ వినియోగదారులు అప్లికేషన్ల కోసం మరోసారి డబ్బులు వెచ్చించటానికి పెద్దగా ఇష్టపడరు. అదే ఆండ్రాయిడ్ లో ఈ సమస్య పెద్దగా ఉండదు. 
  • ఐఫోన్ - ఎక్స్ ఖరీదు దాదాపు లక్ష రూపాయలు. ఇంత ఖరీదు వెచ్చించి కొనుగోలు చేసేవారు మన దేశంలో తక్కువ. అందుకే ఆపిల్ సంస్థ ఇక్కడి అమ్మకాలలో లేటెస్ట్ వాటితో పాటు పాత మోడళ్లను భారీ డిస్కౌంట్లతో అమ్మకానికి పెడుతుంది. అయితే మనదేశంలో అమ్ముడయ్యే ఫోన్లలో 25 వేల కన్నా ఎక్కువ ఖరీదు కలిగిన ఫోన్లను కొనే వారు కేవలం ఐదు శాతం మాత్రమే. వారు కూడా కొత్త ఐఫోన్ మోడళ్ళు వెంట వెంటనే వస్తుండటం, ఇంత ధర పెట్టి కొన్నా కొద్ధి రోజులలోనే కొత్త మోడల్ వచ్చాక దీని ధర విపరీతంగా పడిపోతుండటంతో కొనటానికి ఆసక్తిని చూపటం లేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post