గూగుల్ X-ప్రైజ్ విఫలం - రద్ధు

గూగుల్ X-ప్రైజ్ విఫలం - రద్ధు
గూగుల్ X-ప్రైజ్ విఫలం - రద్ధు 
పది సంవత్సరాల క్రితం గూగుల్, X-ప్రైజ్ సంస్థతో కలిసి ప్రభుత్వేతర సంస్థల కోసం 20 మిలియన్ డాలర్ల బహుమతితో ఒక పోటీని ప్రకటించింది. ఆ పోటీ ప్రకారం చంద్రుని ఉపరితలం పై ఒక రోవర్/రోబో యంత్రాన్ని 500 మీటర్ల దూరం ప్రయాణింపచేసి, అవి రికార్డు చేసిన హై-డెఫినేషన్ వీడియోలను భూమికి పంపించాలి. ఇది సాధించిన తొలి ప్రైవేటు సంస్థకు ఈ బహుమతి చెందుతుంది. 

2007, సెప్టెంబర్ 13 న ఈ పోటీని గూగుల్ X-ప్రైజ్ ప్రకటించింది. తొలుత దీనికి గడువుగా 2012వ సంవత్సరాన్ని నిర్ణయించారు. మానవుడు 1969 లోనే చంద్రునిపై కాలుమోపిన చరిత్ర ఉండటం, ఈ మధ్యకాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఇది సులభ సాధ్యమని, అనేక సంస్థలు దీనికోసం పోటీ పడుతాయని భావించారు. అయితే అనుకున్న గడువులోగా పోటీని ఎవరూ పూర్తి చేయకపోవటంతో పలుమార్లు ఈ గడువును పొడిగించారు. బహుమతి మొత్తాన్ని కూడా 30 మిలియన్ డాలర్లకు పెంచారు.  అనేక పొడిగింపుల తరువాత చివరికి 2018 జనవరి 31న ఈ పోటీ సాధ్యం కాదన్న భావనతో పూర్తి స్థాయిలో రద్ధు చేసారు. 

అయితే ఈ పోటీలో పాల్గొనాలని 30కి పైగా సంస్థలు భావించినప్పటికీ, వాటిలో ఏ ఒక్కటీ కనీసం చంద్రుని చేరలేకపోయాయి. ఏ ప్రైవేటు సంస్థకు చంద్రునిపైకి స్వయంగా చేరుకునే సామర్థ్యం లేక పోవటంతో ఇలా జరిగింది.  మనదేశం నుండి కూడా టీంఇండస్ అనే సంస్థ ప్రయత్నించింది. సంస్థలు చంద్రునిపైకి రోవర్ లను చేర్చేందుకు అంతరిక్ష సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చకపోవటం, వాయిదా పడటం లాంటి కారణాలతో అన్నీ విఫలమయ్యాయి. టీంఇండస్ సంస్థ కూడా ఇస్రో తో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఇలా వాయిదా పడిన వాటిలో ఒకటి. 

ఆశ్చర్యకరంగా ఈ 10-11 సంవత్సరాల కాలంలో కేవలం మూడు ప్రభుత్వ సంస్థలు మాత్రమే చంద్రున్ని చేరగలిగాయి. వాటిలో చైనాకు చెందిన ఛాంగె-3 మాత్రమే రోవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రైవేటు సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించటానికి 50 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చవుతుందని, ఆ మొత్తం తో చూస్తే బహుమతి లెక్కలోకి రాదనీ, పైగా దీనిని సాధించటం వాటికి కష్ట సాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post