చమురు నిల్వలతో సంపదను సమకూర్చుకున్న గల్ఫ్ దేశాలు కొన్ని సంవత్సరాల క్రితం వరకు విదేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే సాంప్రదాయికంగా ఈ దేశాలు నిర్మాణ రంగం, విలాసవంతమైన భవనాలు, ఆర్ధిక సంస్థలు మరియు ఫుట్ బాల్ క్లబ్ లను కొనుగోలు చేయటం వంటి వాటిపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా మాత్రం సిలికాన్ వాలీ టెక్నాలజీ కంపెనీలపై భారీ పెట్టుబడులను కుమ్మరిస్తోంది. రాజరిక వ్యవస్థను అనుసరిస్తున్న ఈ దేశం ఇప్పటికే తమ 45 బిలియన్ డాలర్ల సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ నుండి ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లాలో రెండు బిలియన్ డాలర్లు, ఉబెర్ సంస్థలో మూడున్నర బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.
టెక్నాలజీ కంపెనీలపై పెట్టుబడులతో సౌదీ అరేబియాలో విజ్ఞాన దాయక సమాజానికి బాటలు వేయాలని, తద్వారా భవిష్యత్తులో ఉద్యోగాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దేశ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ సౌదీ ఆరాంకో కూడా మనదేశానికి చెందిన టిసిఎస్, విప్రోలతో చేతులు కలిపి మహిళలకే ప్రత్యేకించిన సెంటర్లను ఏర్పాటు చేయటం ద్వారా వేలాది మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించింది.
సౌదీ యువతలో నిరుద్యోగం ఇప్పటికే 30 శాతానికి చేరటంతో ఇప్పటికే ఆందోళన నెలకొంది. అక్కడ వాక్స్వాతంత్య్రం పై నియంత్రణలు ఉండటంతో యువత సగటు అమెరికన్ కన్నా అనేక రెట్లు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వీడియోలు చూడటం పై వెచ్చిస్తారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ నిబంధనలు సరళతరమవుతున్నాయి. మహిళలకు కూడా ఈ మధ్యే డ్రైవింగ్ చేసే హక్కు లభించింది. అయితే ఇప్పుడు తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఉపయోగ పడవచ్చునేమోగానీ, ఇప్పటిలో ఉద్యోగాలు కల్పించటం అసాధ్యమని ఆర్ధిక వేత్తలు భావిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలకు తగిన నైపుణ్యం సౌదీ యువతలో లేదని, దానికోసం మరిన్ని విద్యాలయాలు అవసరమని, ఉన్నవాటిని కూడా మరింత మెరుగు పరచాలని వారు చెబుతున్నారు.
Post a Comment