మనదేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలోని మానవాభివృద్ధి సూచికలు ఐరోపా ఖండం లోని కొన్ని దేశాలతో సమానంగా ఉన్నాయి. అయితే దక్షిణ భారతానికి, ఐరోపాకు మధ్య మరికొన్ని స్పష్టమైన పోలికలను కూడా మనం గమనించవచ్చు.
ఐరోపాలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాష ఉన్నట్లే, దక్షిణ భారతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాషను మాట్లాడతారు. ఐరోపాలో ప్రతి నలుగురిలో ఒకరు మూడు భాషలు మాట్లాడుతారు. ఇక్కడ ఆ శాతం అంతకన్నా ఎక్కువే. ఐరోపా ఖండంలో సంగీతానికి ఎల్లలు లేకపోగా, ఇక్కడ సంగీతం మరియు సినిమా రంగం ఆ పాత్రను నిర్వహిస్తున్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణ భారత దేశంలోని సినిమాలు మరియు సంగీతం, ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషలలో కూడా ప్రాచుర్యం పొందటం మనం గమనింపవచ్చు. ఒక భాషలో సృష్టింపబడిన సినిమాను, సంగీతాన్ని మరో భాషలో యథాతథంగా గానీ, కొద్ధి మార్పులతో గానీ వినియోగిస్తున్నారు.
సినిమా రంగానికి చెందిన నటులు, సంగీత దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు దక్షిణాదిన అన్ని భాషలలో పని చేయటం కనిపిస్తుంది. తెలుగు సినీ రంగ ప్రారంభం మద్రాసు లోనే జరిగినందువలన తెలుగు, తమిళ పరిశ్రమలలో ప్రారంభం నుండే ఈ ధోరణి ఉంది. మలయాళ సినిమా ముందు తమిళ పరిశ్రమతో, ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమతో సంబంధాలు పటిష్టం చేసుకుంది. కానీ కన్నడ రంగం మాత్రం దీనికి కొంత వరకు మినహాయింపు. కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని రక్షణ విధానాల వలన అక్కడి పరిశ్రమ తెలుగు, తమిళ మరియు మలయాళ పరిశ్రమలతో పూర్తి స్థాయిలో మమేకం కాలేకపోయింది.
Post a Comment