గౌరవం కోసం అడుక్కుంటున్నారా? బెదిరిస్తున్నారా?

గౌరవం కోసం అడుక్కుంటున్నారా? బెదిరిస్తున్నారా?
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత మంది తమ అభిమాన నటీ నటులను, రాజకీయ నాయకులను పేరు చివరన "గారు" అని సంబోధించటం లేదని వ్యక్తులను ట్రోలింగ్ చేయటం మొదలు పెట్టారు. 

అసలు ఈ "గారు" అనే పదంతో అంత గౌరవం లభిస్తుందా?, ఒకవేళ ఆ పదం అంత గౌరవ సూచకమే అయినా అది ఉపయోగించి సంబోధించటం, సంబోధించకపోవటం అనేది వారి వ్యక్తిగత విషయం. ఆ పదం ఉపయోగించటం లేదని వ్యక్తిగతంగా దూషించటం, అవమానించటం తాము అభిమానిస్తున్న నాయకుడి/ నటుడి గౌరవాన్ని మరింత దిగజార్చటమే అవుతుంది. అయినా తెలుగు నాట అభిమాన నాయకులని, నటులని గారు లాంటి గౌరవ వాచకాలు లేకుండా సంబోధించటం ఎప్పటినుండో ఉంది. దివంగత ఎన్టీఆర్ గారిని కూడా కుటుంబ సభ్యులను అన్నట్లు ఎన్టీవోడు అని చాలా మంది అనటం గత తరం వాళ్ళు వినే ఉంటారు. 

ఎన్ని జిల్లాల వ్యవాహారిక సంభాషణలలో గారు అనే పదం ఉపయోగిస్తారు? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. దాదాపుగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తర ఆంధ్ర ప్రాంత వ్యవహారికంలో, మాండలికాలలో 'గారు' అనే పదం కనిపించదు. అక్కడ పుస్తకాలలో, రాతలలో మాత్రం ఈ పదం వాడుకలో ఉంది. ఈ పదాన్ని మూడు నాలుగు జిల్లాల వారు, మిగతా ప్రాంతాల పైన రుద్దుతున్న వాటిలో ఒకటిగా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు అభివర్ణించారు. ఆ పదాన్ని వాడే స్థానికులు కూడా పరాయి ప్రాంత భాషతో ప్రభావితమైన వారుగా విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. 

గారు అనే పదం మనకు రచనలలో కూడా ముందు నుండి ఏమీ కనిపించదు. కొన్ని దశాబ్దాలనుండి మాత్రమే ఇది వాడుకలో ఉంది. గౌరవ సూచకంగా శ్రీ అనే పదం ఎప్పటి నుండో వాడుకలో ఉంది కానీ, గారు పదానికి అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నట్లు నాకయితే తటస్థ పడలేదు. వేరే ప్రాంతాల వారు, వేరే రాష్ట్రాల నుండి వచ్చి తెలుగు నేర్చుకున్న వారు కూడా ఆ పదాన్ని వాడాలని నిర్బంధించటం, వ్యక్తిగత దూషణలకు దిగటం అయితే ఏ మాత్రం సమర్థనీయం కాదు. పైగా అది వైషమ్యాలని పెంచే ప్రమాదం కూడా ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post