శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్టశిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.
శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.
యజ్ఞ వరాహ జయంతి
శ్వేతవరాహ కల్ప ఆరంభ సమయములో శ్రీ మహా విష్ణువు అంతవరకూ జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు వూర్ధ్వ లోకములుగా, ఏడు అధో లోకములుగా విభజించి అవసరమైన వనరులను సమకూర్చసాగాడు. భూమిని తీర్చిదిద్ధే ప్రక్రియలో భాగంగా అనేక పర్వతాలు, నదులు మరియు సముద్రాలను సమకూర్చాడు. అయితే వాటి భారాన్ని తాళలేని భూమి పాతాళానికి కుంగిపోయింది.
దానితో ఆ మన్వంతరానికి అధిపతి అయిన స్వాయంభువ మనువు బ్రహ్మను ఆశ్రయించి ప్రళయమును నుండి రక్షింపమని వేడుకున్నాడు. బ్రహ్మ భూమిని గురించి బాధపడుతూ ఆలోచించసాగాడు. ఆ సమయములోనే అకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుండి బొటనవ్రేలు అకారమంత ఉన్న ఒక వరాహ శిశువు ఉద్భవించినది. చూస్తుండగానే ఆ వరాహము మేఘ ఘర్జన లాంటి ఘర్ఘర ధ్వనిని చేస్తూ పర్వత సమానంగా పెరగసాగింది. బలిష్ఠమైన నల్లని దేహంతో, జ్యోతుల్లా ప్రజ్వరిల్లుతున్న ప్రకాశవంతమైన కళ్లతో, ఇనుప కమ్మీల్లాంటి కోరలతో అతి భీకరమైన ఆకారమును దాల్చినది. బ్రహ్మదేవుడు ఆ సూకరమును స్తుతింపగా, ఆ వరహ భగవానుడు ప్రసన్నుడయి, ప్రళయము నుండి భూమిని రక్షింపటానికి ఉద్యుక్తుడాయెను.
వరాహ రూపం ధరించిన మహా విష్ణువు తన కోరల మీద భూమిని పైకి ఎత్తి, ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఆ అష్ట దిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతున్నాయి.
స్వాయంభువ మన్వంతరములో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహరూపంగా భావిస్తారు. ఈ యజ్ఞ వరాహ జయంతిని చైత్ర బహుళ త్రయోదశినాడు జరుపుకుంటారు.
ఆది వరాహ జయంతి
సనకసనందాది మహర్షులు మహా విష్ణువు దర్శనార్ధమై వైకుంఠమునకు ఏతెంచగా, విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. దానితో ఆగ్రహించిన మహర్షులు వారిని మూడు జన్మల పాటు రాక్షసావతారము దాల్చమని శపించగా, మొదటిజన్మలో హిరణ్యాక్ష, హిరణ్య కశపులుగా జన్మిస్తారు.
అమిత బల సంపన్నుడైన హిరణ్యాక్షుడు విష్ణు నామం జపించే వారిని కష్టాలపాలు చేయసాగాడు. ఒక సందర్భంలో భూమినంతటినీ చుట్టగా చుట్టి పాతాళలోకంలో పడవేసాడు. సకల లోకాలలో అత్యంత ప్రాధాన్యం, ప్రాభవం కలిగినది, సకల ప్రాణికోటికి నిలయమైనది అయిన భూమి కుంగిపోవటంతో దేవతలంతా ఆందోళనతో మహా విష్ణువును ఆశ్రయించారు.
హిరణ్యాక్షుని ఆగడాల పట్ల కోపోద్రిక్తుడైన విష్ణువు భీకరమైన వరాహ అవతారమును దాల్చి పాతాళలోకానికి మార్గమైన సముద్రంలోకి దిగి అక్కడి వరకూ వ్యాపించి ఉన్న కుల పర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకలించసాగాడు. దానితో ఆ పర్వతాలు భయమొంది హిరణ్యాక్షుడు ఉండే చోటును ఆ వరాహ భగవానునికి చూపించాయి. అప్పుడు జరిగిన యుద్ధములో హిరణ్యాక్షున్ని సంహరించి భూమిని యథా స్థానంలో నిలిపాడు. ఇలా భూమిని ఉద్ధరించి దేవతల చేత స్తుతింపబడిన వరాహమూర్తిని ఆదివరాహమూర్తిగా పరిగణిస్తారు. ఈ ఆది వరాహ జయంతిని భాద్రపద శుక్ల తృతీయ రోజు జరుపుకుంటారు.
తిరుమల - ఆది వరాహ స్వామి
తిరుమలలో ముందుగా వరాహ స్వామిని దర్శించిన తరువాతనే స్వామివారిని దర్శించాలనే ఆచారము ఉంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన గాథ ఉంది.
హిరణ్యాక్షుని సంహరించిన తరువాత ఆదివరాహ స్వామి భూమిపైన సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల క్షేత్రం. ఆ స్వామి ఇక్కడే నివాసమేర్పరచు కోవటంతో మొదట ఇది ఆదివరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది. ఆ వరాహస్వామి ఒకసారి భూమి పైన సంచరించే సమయంలో వృషభాసురుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి, తిరుమలకు చేరుతుండగా శ్రీనివాసుడు తటస్థపడతాడు. అప్పుడు వారు ఒకరినొకరు శ్రీ మహావిష్ణువు రూపాలుగా గుర్తిస్తారు. అలా రెండు రూపాలలో ఉన్న విష్ణు భగవానుడు ముచ్చటిస్తుంటే ముక్కోటి దేవతలు ఆనంద పరవశులయ్యారట.
ఆ శ్రీనివాసుడు కలియుగాంతము వరకు ఆ క్షేత్రములో నివసించాలన్న సంకల్పమును వెలిబుచ్చి, కొంత స్థలము ప్రసాదించమని వరాహ స్వామిని కోరగా, దానికి మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని వరాహ స్వామి తెలిపాడు. అప్పుడు శ్రీనివాసుడు స్థలమునకు మూల్యంగా దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము, ప్రధమ నైవేద్యము వరాహ స్వామి జరిగేటట్లు చేస్తానని మాట ఇచ్చాడు. అప్పటినుండి ముందుగా వరాహ స్వామిని దర్శించాలనే ఆచారం వచ్చినట్లుగా కథనం.
వరాహ రూపంలో ఉన్న విష్ణు దేవుడికి ప్రత్యేకమైన ఆలయాలు లేవు. ఆ తరవాతి అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకొంటున్నాడు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ గ్రామం లో నారద మహర్షి ప్రతిష్ఠించినట్లుగా భావించే వరాహ నరసింహమూర్తి దేవాలయం ఉంది.
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా,
శశిని కళంకకలేవ నిమగ్నా,
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే||
కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము – జయదేవుడు
Post a Comment