గబ్బర్ సింగ్ టాక్స్...ఇక్కడ పేలదు

గబ్బర్ సింగ్ టాక్స్...ఇక్కడ పేలదు
రాహుల్ 
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళా స్వయం సహాయక బృందాలతో  భేటీ సందర్భంగా ప్రసంగిస్తూ, తెలంగాణలో ఒకే కుటుంబ పాలన సాగుతుందని అన్నారు. ప్రజలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాను అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

కేంద్రంలో మోడీ కూడా ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చి విఫలం అయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడితే చర్యలు తీసుకోలేదని, మహిళలపై ఎన్ని అకృత్యాలు జరిగినా ప్రధాని మోడీ స్పందించడం లేదని విమర్శించారు. 

కార్పొరేట్ సంస్థలకు 2 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసారని, రైతులకు, మహిళలకు మాత్రం మాఫీ చేయడంలేదని రాహుల్ అన్నారు. అమల్లోకి వచ్చిన జిఎస్టీని రాహుల్ గబ్బర్ సింగ్ టాక్స్ గా అభివర్ణించారు. తాము అధికారంలోకి వస్తే దానిని సరళీకరిస్తామని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ అసత్యాలు చెప్పదని, తాము అమలు చేయగల హామీలే ఇస్తామని రాహుల్ వివరించారు. 

కుటుంబ పాలన ద్వారా వంశపారంపర్యంగా పరిపాలిస్తున్న గాంధీ కుటుంబంలోని వ్యక్తి, కుటుంబ పాలన గురించి మాట్లాడటం ఏమిటో? ఇలాంటి విమర్శల వల్ల ఎదురు విమర్శలు వచ్చే అవకాశాలే ఎక్కువ. ఇంకా ప్రసంగంలో గబ్బర్ సింగ్ టాక్స్ అనే డైలాగ్ వాడారు. దానికి  హిందీ రాష్ట్రాలలో వచ్చిన స్పందన ఇక్కడ రాదు. గబ్బర్ సింగ్ అంటే హిందీ రాష్ట్రాల్లో విలన్ అనే అర్థం కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అలా కాదు. ప్రసంగాల ద్వారా ఆకట్టుకోవాలంటే రాహుల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post