ప్రదోషం

ప్రదోషం

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి,  శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల  నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 

త్రయోదశి మహా ప్రదోషం, 
ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,
సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 
మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 
బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 
గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 
శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 
శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 

వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే  శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు. 

ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి? 

ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని  (ఓ నమ:శివాయ) జపం చేయాలి. ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 

సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.

స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరింపబడింది.

మహా మృత్యుంజయ మంత్రము 

ఓం త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఊర్వారుకమివ బంధనాత్ 
మృత్యోర్ముక్షీయ మామృతాత్

శని ప్రదోషం 

దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.

శని ప్రదోష వ్రతం ఆచరించటం వలన కర్మ దోషాలు, జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రదోష కాలంలో శివారాధన చేయాలి. గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి. శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది. 

సోమ ప్రదోషం 

సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే  సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి . 

గురు ప్రదోషం  

త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు.  గురు ప్రదోష పూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు. జాతకములో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post