కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల భేటీ, మధ్యలో జీవీఎల్

కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల భేటీ, మధ్యలో జీవీఎల్
ఇవాళ టిడిపి ఎంపీలు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ని కలిసి రైల్వేజోన్‌ విషయం తేల్చాల్సిందిగా కోరారు. ఆ సమయంలో బిజెపి ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, హరిబాబు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మంత్రితో వాదనకు దిగగా జీవీఎల్ వారిని అడ్డుకున్నారు. దానితో కోపం వచ్చిన టిడిపి ఎంపీలు మేము మంత్రితో మాట్లాడుతున్నాం, అనవసరంగా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. దీనితో జీవీఎల్ కూడా కోపంతో మాకు నిర్ణయం చెప్పటానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది అని వాదన పెంచారు. 

మాటా, మాటా పెరిగి యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో  ఏం సంబంధం?, నిన్ను ఏపీలో తిరగనివ్వం అని టీడీపీ ఎంపీలు అనగా, సమావేశంలో ఎవరు పాల్గొనాలో మీరెలా నిర్ణయిస్తారని జీవీఎల్ ఎదురుదాడికి దిగారు. దానితో అసహనానికి గురైన కేంద్ర మంత్రి విభజన బిల్లులో రైల్వే జోన్ అంశం కేవలం పరిశీలించాలని మాత్రమే ఉంది. అని చెప్పి అక్కడనుండి నిష్క్రమించారు. 

రైల్వే జోన్ పై స్పష్టమైన నిర్ణయం చెప్పే వరకూ కదిలేది లేదు అని టిడిపి ఎంపీలు అక్కడే రెండు గంటల పాటు బైఠాయించారు. బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఎంపీలు  జీవీఎల్ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేసారు. చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేయటంతో ఆయన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని, బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతోందని, కేంద్రంతో పోరాడి ఏపీకి రావాల్సిన నిధులు వడ్డీతో సహా రాబట్టుకుంటామని వ్యాఖ్యానించారు. 

ఇక బిజెపి అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీ ఎంపీలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, అక్కడవున్న బీజేపీ ఎంపీలు జీవీఎల్, హరిబాబులపై దౌర్జన్యం చేసారని ఆరోపించారు. జీవీఎల్ కు తగిన రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిజిపిని కలుస్తామని చెప్పుకొచ్చారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post