సా...గుతున్న జివిఎల్ అకౌంట్ల రచ్చ

సా...గుతున్న జివిఎల్ పిడి అకౌంట్ల రచ్చ
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, బిజెపి నేత జివిఎల్ నరసింహరావు వెలుగులోకి తెచ్చిన అకౌంట్ల కుంభకోణం రచ్చ, వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారి ఇంకా కొనసాగుతోంది. 

రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, అందులో 53 వేల కోట్లను, అధికారుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని జివిఎల్ నరసింహరావు ఆరోపించారు. ఇక్కడ దుర్మార్గ పాలన సాగుతోందని, కాగ్ నివేదిక చూస్తే ఇది అర్థమవుతోందని ఆయన దుయ్యబట్టారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాభివృద్ది బోర్డు ఉపాద్యక్షుడు సి.కుటుంబరావు ఈ ఆరోపణలను ఖండిస్తూ, జివిఎల్ మిడి, మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, బుడబుక్కల వానికి మల్లే ఆరోపణలు చేస్తున్నారని వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారారు. కావాలంటే సీవీసి కి ఫిర్యాదు చేసుకొమ్మని, ఉత్తరప్రదేశ్ లో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ప్రత్యారోపణలు, ఎదురుదాడి మొదలెట్టారు. 

తెలుగు దేశం పార్టీ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్యా కూడా చంద్రబాబు నాయుడుపై అవాకులు, చవాకులు పేలితే జివిఎల్ ను రాష్ట్రంలోనే తిరగనివ్వబోమని హెచ్చరించారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని, రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఓ పెద్ద కుంభకోణమని, ప్రధాని మోడీకి ఊడిగం చేస్తున్నారని షరా మామూలుగానే తెలుగు దేశం మార్కు ఎదురు దాడి, ప్రత్యారోపణలు చేసారు. బహుశా జివిఎల్ బ్రాహ్మణుడు కావొచ్చు, అందుకే ఆ కార్పొరేషన్ చైర్మన్ను బరిలోకి దింపారు.  

వీటిపై జివిఎల్ వెనక్కు తగ్గకుండా, ఏ రాష్ట్రంలో అయినా పిడి అకౌంట్లు వందల సంఖ్యలోనే ఉంటాయని, 58 వేల అకౌంట్లు ఎందుకు తెరవవలసి వచ్చిందని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా, వ్యక్తిగతంగా దూషిస్తూ, తమ పత్రికలలో హెడ్ లైన్లు పెట్టుకుంటున్నారని అన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి అన్ని అకౌంట్లను జీరో బాలన్సుకు తీసుకురావాలని, వాటిలో 25వేల కోట్ల నిల్వలు ఉంచారని, ఆ అకౌంట్ల సమాచారం కాగ్ కు అందించలేదని, సెల్ఫ్ చెక్ ల ద్వారా విత్ డ్రాలు చేస్తున్నారని మరిన్ని ఆరోపణలను వాటికి జోడించారు.  

ఈ వివాదంలోకి సందట్లో సడేమియా లో వైసీపీ కూడా ఎంటరయింది. ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని వేల కోట్ల కుంభకోణం జరిగితే ఇన్నాళ్లు ఏం చేసారని, సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసారు. పనిలో పనిగా టిడిపి, బిజెపిలు కుమ్మక్కయ్యాయని అందుకే  సిబిఐ విచారణ జరపడం లేదని ఆరోపించారు. 

తెలుగుదేశం విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, టిడిపి హయాంలో వేయి రూపాయల అవినీతి కూడా జరగలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని, జివిఎల్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా జీవీఎల్‌ కు ఏపీలో అడ్రెస్సే లేదని, అడ్రెస్‌ ఒక చోట ఆయన మాట్లాడేది మరో చోట అని,  జీవీఎల్‌ ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు ఎక్కడ ఉందో ఆయనకే తెలియదని వ్యక్తిగత విమర్శలకు దిగారు. 

పరిస్థితి విషమిస్తుండటంతో ప్రణాళికాభివృద్ది బోర్డు ఉపాద్యక్షుడు సి.కుటుంబరావు నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను ఇచ్చిన వివరణ జీవీఎల్‌ గారికి అర్థం కాకపోవటం బాధాకరమని, ఆయన తన సమయం కేటాయించగలిగితే ట్యూషన్‌ చెప్పడానికి సిద్ధమని అన్నారు. తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఒక్క రూపాయి దుర్వినియోగం అయినట్లు నిరూపిస్తే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇక్కడ కూడా ఈయన వ్యక్తిగత ఆరోపణ మరువలేదు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసి జీవీఎల్‌ రాజ్యసభ సభ్యత్వం సంపాదించుకున్నారని అన్నారు. 

మొత్తానికి తెలుగు దేశం ప్రజాప్రతినిధులు ఇచ్చిన అద్భుతమైన వివరణ ఏమిటంటే, వారి హయాంలో, ఒక్క రూపాయి కూడా ఎక్కడా దుర్వినియోగం కాలేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post