యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని తో "ఓ మధుసూధనా! నా యుందు దయ యుంచి శ్రావణ శుక్ల పక్షములో వచ్చే ఏకాదశి మహాత్యమును వివరించుము". అని అడుగగా, దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ "ఏకాదశి మహత్యమును వివరించటం నాకు మిక్కిలి ఆనందదాయకమైన విషయము. ఇది వినినంతనే అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును." అని తెలిపి ఇలా వివరించసాగాడు.
"ద్వాపర యుగారంభంలో మహాజీత అనే పేరుతో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన మాహిష్మతి పురి రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయనకు సంతాన భాగ్యము లేనందువలన విచారంగా ఉండేవాడు. కాలము గడుస్తున్న కొద్ధీ రాజు యొక్క విచారము కూడా పెరగసాగెను.
ఒకరోజు మహారాజు తన సలహాదారులందరినీ సమావేశపరిచి ఇలా అడిగాడు. "నాకు తెలిసి ఈ జీవితంలో నేను ఏ పాపము చేయలేదు, నా ఖజానాలో ఉన్న సంపద కూడా న్యాయబద్ధముగా సంపాదించినదే. ఎన్నడునూ దైవ బ్రాహ్మణుల కోసం నిర్వర్తించవలసిన విధులను నిర్లక్ష్యం చేయలేదు. యుద్ధములలోనూ ఎన్నడూ నీతిని తప్పలేదు. ప్రజలను నా కన్న బిడ్డలుగా చూసుకున్నాను. స్వంత బంధువులు కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే శిక్షించాను, ధర్మ వర్తనులైతే శత్రువులను కూడా రక్షించాను. అయినప్పటికినీ నాకు సంతానము లేదు. దయచేసి దీనికి కారణమును, తగిన నివారణోపాయమును తెలుపవలసింది."
ఇది విని, రాజు యొక్క సలహాదారులు తమలో తాము చర్చించుకుని, రాజు యొక్క సమస్యను తీర్చగలిగే వారికోసం గాలించసాగారు. చివరకు వారు నిష్టాగరిష్ఠుడైన లోమస మహర్షి దీనికి తగినవాడని యెంచి ఆయన ఆశ్రమానికి చేరుకొని ఆయనను ఇలా అభ్యర్థించారు. "ఓ మహాత్మా! మిమ్మల్ని కలవగలగటం మా అదృష్టం. మా మహారాజు పుత్ర సంతానము లేక దుఃఖించుచున్నాడు. దయ చేసి సంతానము పొందే మార్గమును చూపగలరు." దానికి మహర్షి బదులిస్తూ "మీరు మీ ప్రభువు కోసం కష్ట నష్టములకు ఓర్చి ఇక్కడకు వచ్చారు. కానీ మీ మహారాజు ఈ జన్మములో ధర్మ వర్తనుడైనప్పటికీ, గత జన్మలో చేసిన పాపము వలన సంతానము కలగలేదు. "
"గత జన్మలో మహారాజు ఒక వ్యాపారి. వ్యాపార పనుల నిమిత్తము దేశ దేశాలు తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి జ్యేష్ఠ మాసములో ప్రయాణిస్తున్నప్పుడు, దాహము వేసి కొలను దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో ఒక గోవు అప్పుడే పుట్టిన దూడతో నీళ్లు తాగటానికి కొలను వద్దకు వచ్చినది. వాటిని అదలించి పంపించివేసి వ్యాపారి తన దాహమును తీర్చుకున్నాడు. ఆ పాపము వలననే రాజుకు ఈ జన్మలో సంతాన భాగ్యము కలగలేదు." అని తెలిపాడు. దానికి ఆ మహారాజు యొక్క భృత్యులు, తరుణోపాయము చూపమని వేడుకొనగా, దానికి లోమస మహర్షి "శ్రావణ మాసములో శుక్ల పక్షమున వచ్చే పుత్రదా ఏకాదశి రోజు నియమబద్ధముగా వ్రతమాచరించిన దోషము తొలగి పుత్ర సంతానము కలగ గలదని" తెలిపాడు. దానికి వారు మహర్షికి ధన్యవాదములు తెలిపి రాజ్యమునకు చేరుకున్నారు.
తరువాత వచ్చిన పుత్రదా ఏకాదశి రోజున రాజ దంపతులతో పాటుగా రాజ్యములో ఉండేవారందరూ ఏకాదశి వ్రతమును ఆచరించారు. ఆ వ్రత మహత్యము వలన రాణికి కుమారుడు జన్మించాడు. " అని శ్రీకృష్ణుడు తెలిపాడు.
Post a Comment