కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, లోక్ సభ కు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు, కేంద్రం చేపట్టిన చివరి జాతీయ ప్రాజెక్టు అని, ఇకపై ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని ఆయన తెలియచేసారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా విభజన బిల్లులో పొందుపరిచినందున జాతీయ హోదా ఇవ్వాల్సి వచ్చిందని కూడా గడ్కరీ చెప్పారు.
ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని భావించవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళేశ్వరం మరియు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా సాధించటానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎన్నోసార్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు మరియు ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తులు సమర్పించారు. జలవనరుల మంత్రిగా ఉమాభారతి ఉన్నప్పుడు కూడా వీరు ఈ విధమైన అభ్యర్థనలు చేసారు.
ఈ ప్రకటనపై టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేసారు. గడ్కరీ సమాధానం ముగిసిన వెంటనే ఎంపీ వినోద్ కుమార్ లేచి ప్రశ్నించబోగా, స్పీకర్ సుమిత్రా మహాజన్ అవకాశమివ్వక వెనువెంటనే తరువాత ప్రశ్నకు వెళ్లిపోయారు. దీనితో ఆయన గడ్కరీకి లేఖ రాసారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు ఒక జాతీయ ప్రాజెక్టు ఇచ్చినప్పుడు తెలంగాణాలో కూడా ఒక ప్రాజెక్టుకు అవకాశమివ్వాలని వినోద్ లేఖలో తెలిపారు. కేంద్రం నుండి ఆర్థిక సహకారం లేనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపైన అనేక ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన వివరించారు.
Post a Comment