కాపు రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం రోజు ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో బీసీలకు ఎటువంటి అన్యాయం జరగబోదని, అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ కు పది వేల కోట్లు కేటాయించనున్నామని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుండి కాపు రిజర్వేషన్లకు మద్ధతు ఇస్తుందని, అదే సమయంలో ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న బీసీలకు నష్టం కలగకుండా ఉండాలని తన ఉద్దేశ్యమని జగన్ అన్నారు. అయితే మీడియాలో ఒక వర్గం నా వ్యాఖ్యలను వక్రీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించిందని పిఠాపురంలో ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సమావేశంలో ఆయన అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలను, కులాలను చంద్రబాబు నాయుడు మోసం చేసారని జగన్ అన్నారు. అధికారం లోకి వచ్చిన ఆరు నెలల లోగా కాపులకు రేజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో తెలుగు దేశం హామీ ఇచ్చి మోసం చేసిందని, ఇప్పుడు విచిత్రంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి రాజ్యాంగం ప్రకారం 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించలేమని తెలియదా?, మోసం చేసి ఎదుటివారిపై ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని జగన్ దుయ్యబట్టారు.
Post a Comment