నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులలో ఆశలను పెంచుతోంది. శ్రీశైలానికి క్రమంగా వరద పెరుగుతుండటంతో జలవిద్యుత్ కేంద్రాల ద్వారా వదులుతున్న నీటికి అదనంగా 8 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. గత సంవత్సరం అక్టోబరు 12న ఈ గేట్లను ఎత్తడం గమనార్హం.
శ్రీశైలం ప్రాజెక్టు ఇన్-ఫ్లో ఉదయం 3.48 లక్షల క్యూసెక్కులు ఉండగా, సాయంత్రానికి 3.73 లక్షల క్యూసెక్కులకు చేరింది. రాత్రి వరకు తిరిగి 3.24 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఇవాళ మరింత తగ్గనున్నట్లుగా అధికారుల అంచనా. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా నాగార్జున సాగర్ కు ఇన్-ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలు. ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్థ్యం 312టీఎంసీలు.
కర్ణాటక లోని కృష్ణా, తుంగభద్రా నాదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 55 రోజులు ముందుగానే వరద నీరు నాగార్జున సాగర్ ను చేరుకుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖా మంత్రి ఉమామహేశ్వర రావు, పూజలు నిర్వహించి శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి వరద నీటిని విడుదల చేసారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో రాత్రి ఎనిమిది గంటలకు మరో రెండు గేట్లు. పది గంటలకు మరో రెండు గేట్లు తెరిచారు. కాగా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు.
Post a Comment