చాలా మంది మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ కనిపించింది. దీనిపై వారు సోషల్ మీడియాలో తాము నమోదు చేయకున్నా ఎలా చేరిందని, తమ మొబైల్ కాంటాక్ట్ లిస్టును ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆరోపించారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని భద్రతా నిపుణులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసారు.
అయితే, ఆధార్ సంస్థ (UIDAI), ఈ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ నెంబరును ఫోన్లలో నమోదు చేయమని టెలికాం సంస్థలను గానీ , మొబైల్ సంస్థలను గానీ తాము కోరలేదని స్పష్టం చేసింది. టెలికాం ఆపరేటర్లు కూడా తాము చేయలేదని తెలపటంతో మరింత గందరగోళం నెలకొంది. ఈ ఫోన్లను ఎవరో హ్యాక్ చేసారనే వదంతులు కూడా సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
అయితే గూగుల్ ప్రకటనతో ఈ గందరగోళానికి తెరపడింది. తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని లోపాలవల్లే ఇలా జరిగిందని, క్షమాపణ తెలిపింది. అప్డేట్ చేయటం వల్ల ఇది సరి అవుతుందని, ఇష్టం లేని వాళ్ళు ఆ నెంబర్ తొలగించుకోవచ్చని, ఎవరి ఫోన్లు హ్యాక్ కాలేదని వివరణ ఇచ్చింది. 2014 లో తయారైన కొన్ని ఫోన్లలో మాత్రమే ఇలా జరిగిందని కూడా తెలిపింది.
Post a Comment