శ్రావణ మాసము హిందువులు పాటించే చాంద్రమానం ప్రకారము సంవత్సరములో ఐదవ నెల. ఈ నెల పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రములో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసము అనే పేరు వచ్చింది. శ్రవణము విష్ణుమూర్తి జన్మ నక్షత్రము. ఈ నెలలో జన్మించిన వారిలో శ్రీకృష్ణుడు, అరవిందయోగి మరియు హయగ్రీవుడు ఉన్నారు. వర్ష ఋతువు లో ఇది రెండవ మాసము.
శ్రావణ మాసము శూన్య మాసముగా పేరొందిన ఆషాఢ మాసము తర్వాత రావటంతో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసములో ఇతర వ్రతములతో పాటు, వరలక్ష్మి వ్రతము, మంగళ గౌరీ వ్రతము, శ్రావణ సోమవార వ్రతములను ప్రత్యేకంగా ఆచరిస్తారు. పండుగలలో నాగపంచమి, శ్రావణ పుత్రాడ ఏకాదశి, రాఖీపౌర్ణమి, ఋషి పంచమి, సూర్య షష్ఠి, శీతల సప్తమి, జన్మాష్టమి, పొలాల అమావాస్య ముఖ్యమైనవి.
మాఘమాసము లో వచ్చే ఆదివారాలను , కార్తీక మాసములో వచ్చే సోమవారాలను , మార్గశిరమాసములో శుక్రవారాలను, ఇలా ఒక్కోక్క మాసములో ఒక్కొక్క రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. ఐతే శ్రావణమాసములో మాత్రము ప్రతి రోజూ పవిత్రమైనదే.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, శ్రావణ సోమవార వ్రతాలు,
మంగళవారం మంగళ గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారం బృహస్పతి ఆరాధన,
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, తులసి పూజలు,
శనివారం హనుమంతుడికి, వేంకటేశ్వరునికి, శనీశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.
Post a Comment