రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. బిజెపి పార్టీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంట్ లోనే ప్రకటన చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందన్నారు.
చంద్రబాబు ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు హోదాపై రాజకీయాలు మొదలు పెట్టారని, ఈయనే గతంలో ప్రత్యేక హోదాతో ఏం లాభం ఉండందని అన్నారని వ్యాఖ్యానించారు. బాబు తీరువల్లనే ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
ఇప్పుడు ప్రజాభిప్రాయం జగన్ కు సానుకూలంగా ఉందని, ఆయనను చూసేందుకు జనం విరగబడి వస్తున్నారని ఉండవల్లి అన్నారు. అయినా జగన్ కు అనుభవం తక్కువని, రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబుతో గెలవలేడని విశ్లేషించాడు. 2014 లో కూడా ఇలాగే జరిగిందని, పోల్ మేనేజ్ మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు ఎన్నికల సమయంలోగా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడని ఆయన అన్నారు.
ఇక జనసేన పార్టీ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను గురించి ప్రశ్నించగా, వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు. రాష్ట్ర విభజన తప్పు కాదనీ, జరిగిన విధానమే తప్పని ఉండవల్లి అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని కూడా ఈ సందర్భంగా తెలియచేసారు.
Post a Comment