తొలి ఏకాదశి

తొలి ఏకాదశి
హిందువుల పర్వదినమైన తొలి ఏకాదశి రోజును తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడి ప్రజలకు ఏ పనిని ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశిలను పవిత్రమైనవిగా భావించి వాటికోసం ఎదురుచూసే ఆనవాయితీ ఉంది. 

ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొన్న రోజుని ఉత్థాన ఏకాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలంలో చాతుర్మాస్య దీక్ష చేస్తారు. చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఏకాదశి విశిష్టత గురించిన ప్రస్తావన పద్మ పురాణంలో ఉంది. ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినవారు అన్ని సమస్యలనుండి విముక్తి పొందడమే కాకుండా మరణానంతరం వైకుంఠం చేరుకుంటారని అందులో పేర్కొన్నారు. ఏకాదశి మహత్యాన్ని శివుడు పార్వతికి వివరించినట్లుగా ఇది చెబుతోంది. శ్రీ మహావిష్ణువు తో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించిన అనేక కథలు వివిధ పురాణాలలో చెప్పబడ్డాయి.

ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లాన్ని, యాలకులను చేర్చి ఈ పిండిని తయారు చేస్తారు. ప్రతి దేవాలయంలోనూ పేలపిండిని ప్రసాదంగా ఇస్తారు.

తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి?

ఆషాఢ మాసములో శుక్ల పక్ష ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి పొందిన తర్వాత విష్ణుమూర్తిని పుష్పాలతో అలంకరించి, నియమ నిష్ఠలతో పూజించాలి. పాలు, చెక్కెర, కొబ్బరి మొదలైన పదార్థాలతో పాటుగా, మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. ఈ వ్రతమాచరించేవారు ఆ రోజున గుమ్మడికాయ, నూనెలు, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి మరియు వండిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే మంచంపై కూడా నిద్రించకూడదు. తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగరణ చేసి, మర్నాడు అంటే ద్వాదశి ఉదయం విష్ణుమూర్తిని పూజించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేయాలి. 


0/Post a Comment/Comments

Previous Post Next Post