ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం/చదవటం కూడా ఫలితాన్నిస్తుందని చెబుతారు. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి. ఆ కథలను ఇక్కడ తెలుసుకుందాం.
భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ
యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు. "కేశవా, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆరోజున ఏ దేవున్ని ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి."
దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు. "ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధముగా సమాధానమిచ్చాడు. "ఓ నారదా! ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు. అలాగే శ్రీహరి ని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి, పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఆ గాథ నీవు కూడా వినుము." అని తెలిపి ఇలా ప్రారంభించాడు.
పూర్వం సూర్య వంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, ధర్మము తప్పనివాడై మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు.
కొంత కాలము గడచిన పిమ్మట అతని రాజ్యములో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరవు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడ కరువయ్యాయి. అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటం, యజ్ఞ యాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు. "మీరు ఎప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు. కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి పనికీ నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటివలనే శాంతి, సౌభాగ్యాలతో జీవించేలా వరమివ్వండి."
దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో గానీ, వర్తమానంలో గానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపథంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రయత్నిస్తాను. అని తెలిపాడు. ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అక్కడా, ఇక్కడా వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాలలో ఉన్న ఋషులను, మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీర ముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు.
మాంధాత అంగీర ముని ఆశ్రమానికి చేరుకొని, పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి, ఆ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో, తెలుపవలసినదిగా కోరాడు.
దానికి రాజు ఓ మునీంద్రా, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించడానికి, నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చెయ్యండి. అని అభ్యర్థించాడు.
అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, ఇప్పుడు సత్య యుగము, అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ, నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించటం లేదు. మీరు అతనికి మరణ దండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది. అని తెలిపాడు.
దానికి రాజు నేను ఎవరికీ హాని తలపెట్టని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను. దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు. దానికి అంగీర ముని రాజా మీరు, మీ రాజ్యం లోని ప్రజలందరూ ఆషాఢ శుక్ల పక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావము వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటివలే సుభిక్షమవుతుంది. అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు.
తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటివలెనే సుసంపన్నమైంది." అని శ్రీకృష్ణుడు ముగించాడు.
తొలి ఏకాదశిని గురించి నారద పురాణంలో ఉన్న కథ
పూర్వం రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడవటం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా, భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనతో యమ ధర్మరాజు రుక్మాంగదుని వ్రత భంగం చేసిరమ్మని రంభను అతని దగ్గరకు పంపాడు.
రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా, రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు.
తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా, ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానిని రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరతాడు. దానికి ఆమె నీ పుత్రుణ్ని వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడ ప్రత్యక్ష్యమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషక్తుడై తండ్రిలాగే గొప్పపేరు తెచ్చుకుంటాడు.
Post a Comment