వృత్తివిద్యలో క్రీడల కోటా ప్రవేశాలు రద్దు

వృత్తివిద్యలో క్రీడల కోటా ప్రవేశాలు రద్దు
-వీడియో గేమ్‌నూ క్రీడల్లో చేర్చేస్తారా?
-హైకోర్టు మధ్యంతర ఆదేశాలు 

క్రీడా కోటా రిజర్వేషన్ల కింద వృత్తి విద్యలో ప్రవేశాలను ఈ ఏడాది అమలు చేయరాదని తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తులు రామసుబ్రమణియన్, విజయలక్ష్మిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. క్రీడా కోటా కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 7ను టి.శ్రియ, మరో నలుగురు సవాల్‌ చేసిన కేసులో శుక్రవారం ఈ ఆదేశాలు వెలువడ్డాయి. క్రీడా కోటాపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించిందని, శాప్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను ఏసీబీ అరెస్ట్‌ చేసిందని, ఈపరిస్థితుల్లో అధికారులు గత నెల 21న ఇచ్చిన జీవో అమలును నిలిపివేయాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు. దేశంలో ఏనాడు ఆడని ఆటలు జీవోలో పొందుపర్చారని, ఈ తరహా ఆటల పేరుతో దొడ్డిదారిన ప్రవేశాలు పొందడం అన్యాయమని పిటిషనర్‌ లాయర్‌ వాదించారు. నీట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక జీవో ఇచ్చారని, తప్పుడు మార్గంలో వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు జరిపేందుకే జీవో వచ్చిందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాలపై ఆసక్తికర అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

జీవో 7 అమలు కాకుండా స్టే ఇస్తే ఏసీబీ దర్యాప్తునకు మూలమైన పాత జీవో అమల్లోకి వస్తుంది. అందుకే ఈ ఏడాది మొత్తానికే క్రీడా కోటా అమలును నిలిపివేయాలని ప్రభుత్వానికి  ఉత్తర్వులు ఇస్తున్నాం. కొత్త క్రీడల పేర్లు వింటే వీడియో గేమ్‌ను కూడా ఆజాబితాలో చేర్చే ప్రమాదం లేకపోలేదు. సులభమార్గంలో (కేక్‌వాక్‌) ప్రవేశాల కోసం ఇలాంటి పద్ధతులు ఎంచుకుంటున్నారు. రేపు కేక్‌ వాక్‌ అనే పేరుతో ఆట కూడా పుట్టవచ్చు. ఉషు, లాల్‌ బౌల్స్, మోడరన్‌ పెంటథలాన్, సెపక్‌ టాక్రా వంటి క్రీడల పేర్లు ఏనాడూ వినేలేదు. ఇలాంటి ఆటల పేరుతో ప్రవేశాలకు ఆస్కారం ఇస్తే తమ పిల్లలు డాక్టర్‌ కావాలన్న పిచ్చితో వాటిలో శిక్షణ ఇప్పిస్తారు. వృత్తి విద్యాకోర్సులో ప్రవేశం వచ్చేస్తే ఇక ఆటకు మంగళం చెబుతారు. 

1993లో ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో కొన్ని ఇప్పటికే హైకోర్టు విచారణలో ఉన్నాయి. గతం కంటే మెరుగుపడాల్సిన పరిస్థితి లేకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇంత దారుణంగా ఉన్నప్పుడు కోర్టులు కళ్లు మూసుకుని కూర్చోవు. అందుకే ఏడాది అంతటికీ జీవో అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వడం బాధాకరమే అయినా ఇస్తున్నాం. పిటిషనర్‌ అభిప్రాయపడినట్లుగా స్పోర్ట్స్‌ కోటా రద్దు చేయాలనడం సరైనది కాదు. అడ్మిషన్లు పొందిన వారిలో ఇంటర్నేషనల్‌గా ఒక్క అవార్డు కూడా రాలేదని చెప్పి కోటా రద్దు కావాలనుకోరాదు. క్రీడా కోటా రాజ్యాంగబద్ధమేమీ కాదు. అయినా పిటిషనర్‌ క్రీడా కోటా రద్దు కావాలని కోరలేదు. జీవో 7నే సవాల్‌ చేశారు.  గతంలో తామిచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసినవి ఆ విద్యా సంవత్సరానికే వర్తిస్తాయి. ఇప్పుడు ఈ కేసును లోతుగా విచారించాల్సివుంది. కచ్చితంగా అక్రమ మార్గంలో ప్రవేశాలను అడ్డుకోవాలి... అని బెంచ్‌ పేర్కొంది. ఆరు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన బెంచ్‌ విచారణను వాయిదా వేసింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post