బీచ్‌రోడ్‌లో జనసేన కవాతు

బీచ్‌రోడ్‌లో జనసేన కవాతు
వేలాది మంది కవాతులో పాల్గొనేలా ఏర్పాట్లు………..

జనసేన పార్టీ ఊపుమీద వుంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ విశాఖలో రెండో విడత పర్యటన విజయవంతంగా సాగుతుండటంతో పాటు ఆ పార్టీలో కీలక వ్యక్తులు చేరనుండటంతో కార్య కర్తల్లో ఉత్సాహం వెల్లి విరుస్తుంది. పార్టీలో ఇప్పటికే బొలిశెట్టి సత్యనారాయణ, గుంటూరు భారతి చేరడంతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు మరికొం తమంది వార్డు స్థాయి నేతలు ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా జనసేనాని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో దాడి పవన్‌కు రాజకీయంగా సూచనలు, సలహాలు ఇచ్చారని, త్వరలోనే కార్యకర్తల సమావేశం పెట్టి జనసేనలో చేరుతారన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో వున్నారు. 8వ తేదీన మరికొంతమంది నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఈ సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌ కేంద్రానికి వినపడేలా జనసేన పెద్ద ఎత్తున నిరసన కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. బీచ్‌రోడ్‌లో శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ వేలాది మందితో ఈ కవాతు నిర్వహించేందుకు కార్యకర్తలు, నేతలు సిద్ధమవుతున్నారు. జనసేనాని పవన్‌కళ్యాణ్‌ ఈ కవాతుకు రానుండటంతో బల నిరూపణ చేసుకునేందుకు కొత్తగా చేరిన నేతలు పోటీ పడుతున్నారు.

0/Post a Comment/Comments