సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కు ఢిల్లీ కోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్‌ను ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే కోర్టు జులై 7న కోర్టు ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. కాగా నేడు దిల్లీ కోర్టు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ లక్ష రూపాయల పూచికత్తుపై ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది.
2014 జనవరి 17న సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మరణించి కనిపించారు. అంతకుముందు రెండ్రోజుల క్రితమే పుష్కర్ తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్ జర్నలిస్ట్‌తో సంబంధం ఉందని నిందిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పుష్కర్ మరణించడానికి ముందు రోజుల్లో థరూర్ ఆమె ఫోన్‌కాల్స్‌ను నిర్లక్ష్యం చేశాడని, ఆమె కాల్స్ కట్ చేశారని అందువల్లే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు వెల్లడించారు. థరూర్‌పై సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని ఆరోపణలు ఉన్నాయి. సునంద మరణించడానికి ముందు ఆమె చేసిన ఈమెయిల్స్, మెసేజెస్, సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నింటిని పరిగణలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Post a Comment