ప్రజలచేత ఎన్నుకోబడిన ఢిల్లీ సర్కారుకే సర్వాధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే ఆప్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రతి నిర్ణయానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం అవసరం లేదని కోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉన్నతాధికారులు నిలిపివేశారు. వాస్తవానికి ఈ తీర్పు ఢిల్లీ ప్రభుత్వానికి ఏమాత్రం ఊరట కలిగించేదికాదు. ప్రజాభద్రత, పోలీస్, భూమి వ్యవహారాలు వంటి కీలక అంశాలపై కేంద్రం పెత్తనమే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తద్వారా ఢిల్లీ జుట్టు కేంద్రం అధీనంలో ఉంటుందన్నమాట. అదే సమయంలో.. ఢిల్లీ దేశ రాజధాని అయినందున ఆ ప్రాంతానికి ‘సంపూర్ణ రాష్ట్ర హోదా’ ఇవ్వడం కూడా సాధ్యం కాదని పరోక్షంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పినట్లయిందని న్యాయ నిపుణులు అంటున్నారు. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ సర్కారు సంబురాలు చేసుకోవాల్సింది ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం అధికారుల బదిలీలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను, చట్టబద్ధంగా సరి కాదని పేర్కొంటూ అధికారులు తిరస్కరించారు. బదిలీలకు సంబంధించి పూర్తి అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కే ఉంటాయంటూ సర్వీసెస్ డిపార్టెంట్ ఆ ఆదేశాలను నిలిపివేసింది.
బుధవారం సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీఎం కేజ్రీవాల్‌కు బదిలీలు చేసే అధికారం కల్పిస్తూ ఓ ఫైల్‌ను సర్వీసెస్ కార్యదర్శికి పంపారు. అయితే.. ఇది చట్టబద్ధంగా అంగీకారయోగ్యం కాదని, బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇంచార్జిగా ఉంటారని పేర్కొంటూ ఆ ఫైలును సర్వీసెస్ డిపార్ట్‌మంట్ తిప్పిపంపింది. దాంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీనితో ఆప్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం కేంద్రం పక్కన పెడుతోందని విమర్శించారు. నిన్నటి తీర్పులో కోర్టు స్పష్టంగా.. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు. ఆ లెక్కన కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. మా ఆదేశాలను ఆమోదించకుండా.. తాము పంపిన ఫైల్‌ను తిరిగి ఎల్జీ పరిశీలనకు పంపితే అది కోర్టు ధిక్కరణే అవుతుందని, ఈ విషయంలో తమ న్యాయవాదులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు.
సర్వీసులకు సంబంధించి 2015 మేలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేయలేదు. కిందిస్థాయిలోని అంటే స్టెనో తదితర స్థాయిల్లోని ఉద్యోగాలను మాత్రమే బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అని సర్వీస్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. బదిలీలకు సంబంధించి ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ సంతకాలు చేయాల్సి ఉండాల్సి ఉందంటే అది కోర్టు ధిక్కరణే అవుతుందని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్‌కు ఓ లేఖ రాశారు. అందులో సుప్రీంకోర్టు తీర్పు అంశాలను ప్రస్తావించారు. ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లు ఎల్జీ ఆమోదానికి పంపాల్సిన అవసరం లేదని, అయితే ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమాచారం ఇస్తామని ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వమే ఢిల్లీకి బాస్
సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా, ఢిల్లీ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే బాస్ అని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అనడం గమనార్హం. ఢిల్లీపై సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని, దేశ రాజధానిలో కేంద్రానిదే పైచేయిగా ఉంటుందని జైట్లీ పేర్కొనటం అత్యంత ప్రాధాన్యమైన అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Post a Comment