శాకంబరీ దేవి ఉత్సవాలు


బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ త్రయోదశి నుంచి గురుపౌర్ణమి వరకు శాకంబరీ దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చాల ప్రాంతాలలో ఇదే సాంప్రదాయం పాటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగు నవరాత్రుల్లో భాగంగా కూడా ఒకరోజు శాకంబరీ దేవి ఉత్సవం నిర్వహిస్తారు. మరికొంత మంది ఆషాఢ నవరాత్రి మొత్తాన్ని శాకంబరి నవరాత్రిగా జరుపుకుంటారు. 

అమ్మవారి శాకంబరి దేవి అవతారం మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల  క్షామం నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆకలి దరి చేరదు అని భక్తులు విశ్వసిస్తారు.       

కూరగాయలు, పండ్లతో అలంకారం

శాకంబరీ దేవి ఉత్సవం సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు  పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు. భక్తులు కూడా దక్షిణగా పండ్లు, కూరగాయలు సమర్పిస్తారు. 

అమ్మవారిని శాకంబరీ దేవిగా ఎందుకు పూజిస్తారు? 

వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు.  దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తి హీనులైపోయారు. నదీ నదాలు ఎండి పోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. 

ఋషులు, దేవతలు సర్వ శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవిని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవి కరుణతో “శతాక్షి” గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని  చూసి అమ్మవారి ఒక  కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి  పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో  శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్శనమిచ్చింది.  ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే  ఈ శాకంబరి అవతారం.

పార్వతీ దేవి దుర్గగా, తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. తదనంతరం దేవతలు, బ్రాహ్మణులు తిరిగి వేద పఠనం  కొనసాగించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post