పోతిరెడ్డిపాడు నీటి విడుదలకు కనీస నీటిమట్టాన్ని 841 అడుగులకు తగ్గించటం మంచిదేనా?

pothoreddypadu

శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల కంటే తక్కువ నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 23, 2017 రోజున జీవోను జారీ చేసి, శ్రీశైలంలో 841 అడుగుల నీరు ఉన్నప్పుడు కూడా హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని విడుదల చేయవచ్చని పేర్కొంది. ఆ మేరకు కాలువలను ఆధునీకరించటానికి  17 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. దీనితో ఇప్పుడు రాష్ట్ర నీటి పారుదల అధికారులు ఇవాళ నీరు విడుదల చేయనున్నారు. 

854 అడుగుల నీటిమట్టం నిర్వహించటానికి తెలంగాణ ప్రభుత్వం తమ సమ్మతిని ఉపసంహరించుకున్నామని ఈ మధ్య రాసిన లేఖలో తెలిపింది. అయితే దానిని ఆంధ్ర ప్రదేశ్ ఈ విధంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. కానీ, ఇంకా ఒక రోజు పాటు వేచి చూస్తే నీటి మట్టం 854 అడుగులకు చేరుతుంది. అంతలోపే విడుదల చేయటం అంటే ఇప్పటి ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

పోతిరెడ్డి పాడు నిర్మాణ సమయంలో, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయకట్టు కృష్ణా బేసిన్ కిందకు రాదని, బేసిన్లో ఇంకా నీటి అవసరాలు తీరలేదని ఫిర్యాదు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తమకు ఈ ప్రాజెక్టు కింద అసలు నికర జలాలు అవసరం లేదని లేఖ ఇచ్చారు. అంటే ఇది అప్పట్లో కేవలం వరద జలాల కోసం మాత్రమే ఉద్దేశించిన ప్రాజెక్టు. అంటే శ్రీశైలం, నాగార్జునసాగర్లు నిండి వరదలు వచ్చినప్పుడు మాత్రమే నీటిని విడుదల చేయాలి. 

పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగిన తర్వాత  రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, శ్రీశైలం డ్యాం నీటి మట్టం 854 అడుగుల ఎత్తుకన్నా ఎక్కువ ఉన్నప్పుడే రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో పై అప్పట్లోనే టిఆర్ఎస్ పార్టీ నానా యాగీ చేసింది. వరద జలాలకోసం నిర్మితమైన ప్రాజెక్టుకు నీటి కేటాయింపు ఎలా చేస్తారని గగ్గోలు పెట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలు లేవనెత్తిన అభ్యంతరాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైఎస్ ప్రభుత్వం సమాధానమిస్తూ తమ వాటా లోంచే నీటిని ఈ ప్రాజెక్టుకు వాడుకుంటున్నామని, ప్రత్యేక కేటాయింపులు కోరబోమని వివరణ ఇచ్చింది. 

కానీ తర్వాత కాలంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నికర జలాల కేటాయింపులు జరపాలని వాదనలు వినిపించింది. ట్రిబ్యునల్ ముందు రాసిన లేఖల మూలంగా ఆంధ్రప్రదేశ్ వాదనలు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తాగునీటిని కూడా పరిగణలోకి తీసుకుని కేవలం నామ మాత్ర కేటాయింపులు మాత్రమే చేసింది. అయితే ఇప్పుడు 841 అడుగులకు తగ్గిస్తే తర్వాత పరిణామాలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. 

ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య తుది కేటాయింపులు జరపలేదు. తెలంగాణాలో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నారు. గమనించవలసిన అంశం ఏమిటంటే అవన్నీ కృష్ణా బేసిన్ పరిధిలోకే వస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ కు ఇప్పుడు కృష్ణా జలాల అవసరం పెద్దగా లేదని, అందుకే పక్క బేసిన్ లోకి నీటిని మళ్లిస్తుందనీ వాదనలు వినిపిస్తుంది. 854 అడుగులు అనేది ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పటానికి వీలుండదు. 

తుది కేటాయింపుల తర్వాత ఎలా వాడుకున్నా పెద్దగా నష్టం ఉండదు కానీ, ఇప్పుడు నాన్ బేసిన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా నష్టాన్ని కలిగిస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post