టిఆర్ఎస్ లో వారసుల టిక్కెట్ల గోల

టిఆర్ఎస్ లో వారసుల టిక్కెట్ల గోల
తెలంగాణలో అధికారంలో ఉన్న  తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్లకు పోటీపడుతున్న వారసుల జాబితాపై అనేక గాలి వార్తలు వినిపిస్తున్నాయి మరియు వివాదాలు కూడా ముసురుకుంటున్నాయి. 

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన స్థానమైన స్టేషన్ ఘనపూర్ నుండి తన కుమార్తెను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఆయన కూతురు కావ్య ఇప్పుడు వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాథాలజిస్టుగా పనిచేస్తుంది. కానీ ఇప్పటికీ అక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ వార్తలపై మండిపడుతున్నారు. 

భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ఎస్. మధుసూదనా చారి  కుమారుడు,  ఈ దఫా తన తండ్రి స్థానం నుండి ఆయనకు బదులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమెల్సీలుగా ఉన్న కొండా సురేఖ దంపతులు కూడా ఇదే స్థానం నుండి వారి కుమార్తె సుస్మితకు టికెట్ ను ఆశిస్తున్నారు.  

వీరే కాకుండా ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి మరియు చందూలాల్ వృద్దాప్య మరియు ఆరోగ్య కారణాల వల్ల విరమించుకొని వారసులను ముందుకు తీసుకురానున్నారు. తుమ్మల, తలసానిలు తాము ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలు కుమారులకు ఇచ్చి పార్లమెంట్ కు వెళ్లాలనుకుంటున్నారు.  కాగా రాజేందర్ మాత్రం తన భార్యను పార్లమెంట్ కు పంపాలని భావిస్తున్నారు. 

ఇప్పటికే రాంనగర్ కార్పొరేటర్ గా ఉన్న హోమ్ మంత్రి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ నుండి నాయని పోటీ చేసారు. కాగా జూపల్లి కుమారుడు అరుణ్ కు మాత్రం ఆయన తండ్రి 2024 వరకు వేచి చూడాలని స్పష్టం చేసారు. 

మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి మేడ్చల్ స్థానాన్ని, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుత్బుల్లాపూర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆలంపూర్ నుండి ఓడిపోయిన మందా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్ మళ్ళీ ఈసారి అదే స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్, ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ స్థానాన్ని ఆశిస్తుండగా అది దాదాపు ఖాయమైంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post