పూరి జగన్నాథుడికి జరిపే ప్రధానమైన ఉత్సవాలలో రథ యాత్ర, స్నాన యాత్రలతో పాటు చందన యాత్ర కూడా ఒకటి. మూడు ఉత్సవాల్లో ఇదే సుదీర్ఘమైనది. 42 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రను గంధ లేపన యాత్ర అని కూడా పిలుస్తారు.
చందన యాత్ర వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షయ తృతీయ రోజు ప్రారంభమవుతుంది. అక్షయ తృతీయను ఈ ప్రాంతంలో వ్యవసాయ సంబంధమైన పండగగా జరుపుకుంటారు. ఇదే రోజు రథ యాత్రకు సంబంధించిన రథాలను కూడా తయారు చేయటం మొదలు పెడతారు.
ప్రజలలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం ఆ జగన్నాథుడే, ఇంద్రద్యుమ్న మహారాజుని చందన యాత్రా వేడుకను జరపమని ఆదేశించాడు. ఈ యాత్రలో భాగంగా స్వామిని చందన లేపనంతో కొలనులో విహరింపజేస్తారు. ఈ వేడుక బహార చందన అనే పేరుతో 21 రోజులపాటు, భితర చందన అనే పేరుతో మరో 21 రోజుల పాటు జరుగుతుంది. బహార చందనను నరేంద్ర తీర్థ అనే చెఱువులో, భితర చందనను ఆలయం లోపల గల జల క్రీడా మంటపంలో జరుపుతారు.
బహారా చందన
అక్షయ తృతీయ రోజు మొదలయ్యే బహార చందన 21 రోజుల పాటు కొనసాగుతుంది. ఆలయ సింహద్వారం నుండి పంచ పాండవుల తో పాటు జగన్నాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా నరేంద్ర తీర్థ వరకు తీసుకెళతారు. సాయంత్రం వేళ గంధ లేపన ఆచారాలు పూర్తి అయిన తరువాత అద్భుతంగా అలంకరించిన పడవలో విహారం చేయిస్తారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, కన్నుల విందుగా ఉండే ఈ విహారాన్ని దర్శిస్తారు.
భితర చందన
బహారా చందనా పూర్తయిన తర్వాత భితర చందన ఇరవై ఒకటి రోజుల పాటు జరిపిస్తారు. ఇక్కడ 21 రోజులలో కేవలం నాలుగు రోజులలో మాత్రమే అంటే అమావాస్య, పూర్ణిమ, షష్ఠి మరియు శుక్ల పక్ష ఏకాదశి రోజులలో మాత్రమే జగన్నాథుడు జల విహారం చేస్తాడు. ఈ 21 రోజులు, దేవాలయ లోపల జరగవలసిన చందన లేపన సేవలు జరిపిస్తారు.
Post a Comment