పూరి జగన్నాథ రథయాత్రలో జగన్నాథ, బలరామ, సుభద్ర విగ్రహాలను దేవాలయ నమూనాల్లో నిర్మించి, అలంకరించిన రథాలలో పూరీ వీధుల గుండా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష ద్వితీయ రోజున 'బోడోదండ' అనే ప్రధాన రహదారి గుండా సాగుతుంది. లక్షలాది భక్తుల మధ్య కోలాహలంగా సాగే ఈ ఉత్సవం ప్రధాన ఆలయం వద్ద ప్రారంభమై గుండిచా ఆలయం వద్ద ముగుస్తుంది.
యాత్రా పరిచయం
భారతదేశంలో హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవాలలో ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. పూరి జగన్నాథ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుక ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలలో ఒకటి. దీనికి సంబంధించిన ప్రస్తావనలను మనం బ్రహ్మ పురాణం , పద్మ పురాణం, స్కంధ పురాణం మరియు కపిల సంహితల్లో చూడవచ్చు. ఈ రథోత్సవాన్ని, రథ జాత్ర, రథ యాత్ర అని కూడా పిలుస్తారు.
ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఆషాఢ శుక్ల పక్ష ద్వితీయ రోజు జరుపుకుంటారు. ఈ యాత్ర పూరీ ప్రధాన ఆలయం నుండి మౌసీమా దేవాలయం మీదుగా గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. గుండిచా ఆలయం ప్రధాన దేవాలయం నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
జగన్నాథ రథ యాత్రలో భాగంగా, జగన్నాథ స్వామి, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర లతో కలసి ఊరేగింపుగా గుండిచా దేవాలయానికి వెళ్లి అక్కడ బస చేస్తారు. ఈ సమయంలో స్వామి వెంట సుదర్శన చక్రం కూడా ఉంటుంది. ఈ ఊరేగింపు వెళ్ళేటప్పుడు మధ్యలో ముస్లిం భక్తుడు భక్త సలబేగా జ్ఞాపకార్థముగా కొద్దిసేపు నిలుపుతారు.
తొమ్మిది రోజుల తర్వాత అక్కడి నుండి ప్రధాన ఆలయానికి తిరుగు పయనమవుతారు. ఈ తిరుగుదారిలో మౌసీ మా ఆలయం వద్ద ఆగి 'పొడ పిత' అనే అర్పణ గావిస్తారు. తిరుగు ప్రయాణ ఉత్సవాన్ని బహుదా యాత్ర అంటారు.
జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు
- ఈ ఊరేగింపు కోసం ప్రతి యేటా కొత్త రథాలను సాంప్రదాయబద్ధంగా తయారు చేస్తారు. మిగిలిన అన్ని దేవాలయాలలో ప్రతి సంవత్సరం దాదాపు ఒకే రథాన్ని రథయాత్ర కోసం వాడుతారు.
- ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఎటువంటి పరిస్థితులలోనూ మూలవిరాట్టును బయటకు తీసుకురారు. ఇలాంటి ఊరేగింపుల కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలుంటాయి. కానీ జగన్నాథ రథ యాత్రలో ప్రధాన విగ్రహాలతోనే ఉత్సవము జరుపుతారు.
ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. పూరీ నగరవీధులన్నీ భక్తిభావం తో కూడిన నినాదాలు, శ్లోకాలు, మేళతాళాలు, జయజయధ్వానాలతో మారుమోగుతుంటాయి. భక్తులంతా రథాన్ని లాగేటప్పుడు కనీసం ఒకసారైనా చేయి వేయాలని భావిస్తారు. ఇది అత్యంత పవిత్ర కార్యమని భావిస్తారు. ఈ ఉత్సవానికి హాజరయ్యే భక్తుల సంఖ్యా ప్రతి ఏటా భారీగా పెరుగుతుంది. దేశ, విదేశాలకు చెందిన అనేక టెలివిజన్ చానెళ్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుంది.
రథయాత్ర నిర్వహించటం ఎలా మొదలైంది
రథయాత్ర నిర్వహించటం ఎలా మొదలైంది అనేదాని గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు.
పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథ, బలభద్రుల కోసం ప్రధానాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహ దేవతలనూ గుడి లోని రత్నసింహాసనంపై ఆశీనులు గావించి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. గుండీచా ఆలయాన్ని స్వామి వారి అతిథిగృహం గా భావించవచ్చు.
రథయాత్రకు సన్నాహాలు
రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. సాంప్రదాయం ప్రకారం పూరీ రాజు వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు.
బలభద్రునికీ, సుభద్ర కు మరియు జగన్నాథునికి ప్రతి సంవత్సరం నిర్మించే నూతన రథాలు ఫసి, దౌసా వంటి నిర్దిష్టమైన చెట్ల కలపతో నిర్మిస్తారు. వంశ పారంపర్యంగా ఈ పని చేస్తున్న వడ్రంగి పనివారు, ఒకప్పటి పూరి సంస్థానంలో భాగమైన దసపల్లా వెళ్లి అవసరమైన కలపను సేకరించి 1072 ముక్కలుగా ఖండిస్తారు. ఈ కలప దుంగలను తెప్పలుగా కట్టి మహానదిలో వదిలేస్తారు. తిరిగి వాటిని పూరి సమీపంలో సేకరించి రోడ్డు మార్గంలో రవాణా చేస్తారు.
అక్షయ తృతీయ రోజున చందన యాత్ర తో పాటుగా రథ నిర్మాణం మొదలు పెడతారు. ఈ ప్రక్రియ పూరి ఆలయ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న రాజభవనం ముందు జరుగుతుంది. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి ఈ కార్యక్రమంలో భాగమవుతారు. ముందుగా తీసుకు వచ్చిన 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ ఉపయోగిస్తారు.
మూడు రథాలను శతాబ్దాలుగా అనుసరింపబడుతున్న పద్దతుల ప్రకారం అలంకరించి బోడోదండ లోని సింహద్వారం వద్ద నిలబెడతారు. ఈ రథాలను ఆకుపచ్చ, నలుపు, పసుపు మరియు ఎరుపు రంగులతో అలంకరిస్తారు.
రథ విశేషాలు
రథ విశేషాలు
జగన్నాథుడి రథాన్ని నంది ఘోష అని పిలుస్తారు. ఇది దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల పొడవు మరియు 35 అడుగుల వెడల్పును కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. సుమారు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ రథాన్ని ఎరుపు మరియు పసుపు రంగుల వస్త్రములతో అలంకరిస్తారు. జగన్నాథుని బంగారు (పసుపు) వర్ణం గల వస్త్రములతో అలంకరిస్తారు.
బలభద్రుడి రథాన్ని తాళ ధ్వజమని పిలుస్తారు. 44 అడుగుల ఎత్తుగల ఈ రథంపై ఉండే పతాకంలో తాళ వృక్షం ఉంటుంది. ఈ రథానికి ఏడు అడుగుల వ్యాసం గల 14 చక్రాలు ఉంటాయి. ఈ రథాన్ని ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల వస్త్రములతో అలంకరిస్తారు.
సుభద్ర రథాన్ని ద్వర్పదళన అని పిలుస్తారు. 43 అడుగుల ఎత్తుగల ఈ రథానికి ఎడడుగుల వ్యాసం గల 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాన్ని ఎరుపు మరియు నలుపు రంగుల వస్త్రములతో అలంకరిస్తారు. నలుపును సంప్రదాయబద్ధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అలంకరించేందుకు వాడతారు. ఈ రథానికి పద్మద్వజమనే మరొక పేరు కూడా ఉంది.
ప్రతి రథాన్ని తొమ్మిది మంది పార్శ్వ దేవతలు అధివేష్టించి ఉంటారు. ఈ దేవతలను కూడా రథానికి చెక్కి రంగులతో అలంకరిస్తారు. అలాగే ప్రతి రథానికి నాలుగు గుఱ్ఱాలు పూన్చబడి ఉంటాయి. బలరాముని రథానికి నలుపు రంగు, జగన్నాథుడి రథానికి తెలుపు రంగు మరియు సుభద్ర రథానికి ఎరుపు రంగు గుఱ్ఱాలు ఉంటాయి. అలాగే దారుక, మాతలి మరియు అర్జునులు వరుసగా జగన్నాథునికీ, బలభద్రునికీ మరియు సుభద్రలకు సారథులుగా వ్యవహరిస్తారు.
జగన్నాథ రథోత్సవం
శుక్ల పక్ష విదియ రోజు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళిన పండాలు (పూజారులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్త సమయంలో మనిమా (జగన్నాథా) అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభాల మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. తొలుత సుమారు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చి, ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్టింపజేస్తారు. బలభద్రుణ్ణి చూడగానే 'జై బలరామ, జైజై బలదేవ' అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది. అనంతరం ఆ బలరామ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. తరువాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం రథం మీద ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వస్తుండగా 'జయహో జగన్నాథా' అంటూ భక్తులు జయజయద్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను 'పహాండీ' అని అంటారు. కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడిని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలను రథం మీదకు తీసుకువచ్చేవారిని 'దైత్యులు' అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన 'సవరతెగ' రాజు 'విశ్వావసు' వారసులు, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం విగ్రహాలను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాలమీద ప్రతిష్టింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథాలను అధిరోహించి యాత్రకు సిద్ధంగా ఉండగా, పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను 'చెరా పహారా' అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. జగన్నాథుడి రథం పైన ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరీ కళ్ళాపిజల్లి హారతిచ్చి 'జై జగన్నాథా' అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్ళను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే 'ఘోష యాత్ర' అంటారు.
ఈ యాత్రలో భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను సైతం కూల్చి మరీ ముందుకు నడిపిస్తారు. 'Juggernaut' అనే ఆంగ్లపదం ఈ సందర్బంగానే జగన్నాథ పదం నుండి ఉద్భవించిందని భావిస్తారు.
ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి ఆలయం నుండి రెండు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా ఆలయానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి రథాల్లోని మూలవిరాట్లకు బయటే విశ్రాంతిని ఇస్తారు. మర్నాడు ఉదయం మేలతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమిరోజున తిరుగుప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఆరోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి రోజున స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్నే 'సునావేష' గా వ్యవహరిస్తారు. ద్వాదశిరోజున విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర సమాప్తమవుతుంది.
Post a Comment