జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, సిద్ధాంత పరమైన అయోమయంలో ఉన్నారా?, ఆయన రాజకీయ నడవడిక అనేక సందేహాల్నికలిగిస్తుంది.
చంద్రబాబు అడిగాడని 2014లో మద్దతిచ్చాను
ఎవరు ఏ రాజకీయ పార్టీని స్థాపించినా అది అధికారంలోకి వస్తేనే వారి ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. వారి భావజాలం వ్యాప్తి చెందుతుంది. పక్కన ఉండి మద్దతు ఇస్తాను, అంటే అది ఏ తరహా రాజకీయమో అర్థం చేసుకోవటం కష్టం. ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా లాంటి పార్టీలు కూడా తమ భావజాల వ్యాప్తి కోసం పూర్తి స్థాయిలో వాటికి చేతనైనంత మేర ఎన్నికల బరిలోకి దిగాయి.
రాజకీయ నాయకుడికి సొంత అభిప్రాయాలు ఉండాలి. ఎవరైనా బతిమాలారనో, బుజ్జగించారనో, భయపెట్టారనో మద్దతివ్వకూడదు. ఏం చేసినా రాజకీయంగా వ్యూహం, లాభం ఉండి తీరాలి.
మద్దతిచ్చాను అంటే గెలిచిన ఎవడూ నీ మద్దతుతోనే గెలిచానని ఒప్పుకోడు. అంత మద్దతున్న వాడివైతే నీవే పోటీ చేసి గెలిచేవాడివి, నాకెందుకు మద్దతిస్తావు? అని ప్రశ్నిస్తాడు.
గెలిచిన తర్వాత ప్రశ్నిస్తాను
ప్రశ్నించటానికి రాజకీయ పార్టీ అవసరం లేదు. NGO సరిపోతుంది. మద్దతునే ఒప్పుకోని వాడు, ప్రశ్నలను ఏం భరిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మొదట్లో పెద్దగా ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం ఏం చేసినా వెనకేసుకొచ్చే ప్రయత్నమే చేసాడు. కొత్తరాష్ట్రం కాబట్టి ఒకటి, రెండు సంవత్సరాల వరకు ఈ ధోరణి అర్థం చేసుకోవచ్చు. కానీ అది మరింత ఎక్కువ కాలం కొనసాగింది.
ఇక ప్రశ్నించటానికి నిజమైన ప్రయత్నం చేసింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడే, దానికి విషయ పరిజ్ఞానం ఉన్న వారినే ఎంచుకున్నాడు కానీ ఆ అనుభవజ్ఞులు కోవర్టులు, ట్రోజన్ హార్స్ లాంటి వారు కావటంతో అది ప్రహసనంగా మారింది.
ఓట్లు (?) చీలి పోకూడదని మద్దతిచ్చాను.
ఓట్లు చీలిపోవటం అంటే పవన్ కళ్యాణ్ ది, చంద్రబాబుది ఒకే భావజాలమా ? కాదే, ఎంత కులం ముద్రను వేసుకోకూడదనుకున్నా ఈ వ్యాఖ్య ఖచ్చితంగా దాన్నే సూచిస్తుంది. సరే ఓట్లు కలవటం వల్ల ఉపయోగం ఏమిటి? తరువాత పరిణామాలు ఏమైనా ఆలోచించారా? గెలిచాక ఇలా నడవాలని గానీ, ఏమైనా ఇతరత్రా గానీ హామీలు తీసుకున్నారా? ఏమీ లేకుండా గుడ్డిగా నమ్మి మద్దతు ఇచ్చేసారా? ఏ హామీలు లేకుండా చంద్రబాబును నమ్మటం..... ఇది ఖచ్చితంగా అయోమయమే!
కమ్యూనిజమా? దేవుడా ?
పవన్ కళ్యాణ్ గారు ప్రారంభం నుండి తాను చేగువేరాకు, కమ్యూనిజానికి అభిమానిని అని చెప్పుకుంటారు. ఆ భావజాలాన్నే చదివానని ఇష్టపడతానని ఎన్నో సార్లు చెప్పారు. కానీ ఇటీవల ఒక సభలో ఎర్ర కండువా భుజంపై వేసుకుని మరీ దేవుడి దయ ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. అంత కమ్యూనిస్టు దేవుని గురించి మాట్లాడమేంటో!
నేను అప్పట్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకొని ఉండొచ్చు. అది ఆయన వ్యక్తిగతం. కానీ దానిని ఇప్పుడు రాజకీయ పర్యటన సందర్భంగా బయట పెట్టడమేంటి? సానుభూతి ఆశిస్తున్నారా?
రాజకీయ నాయకుడు అనేవాడు, అదీ సొంతంగా పార్టీని స్థాపించిన వాడు దృఢమైన వ్యక్తిత్వం కలవాడుగా, తన వైపుకు వచ్చే వారందరికీ తనే ధైర్యం, మద్ధతు ఇచ్చే వాడిలా కనిపించాలి.
పార్టీ నిర్మాణం - లక్ష్యం పట్ల స్పష్టత
ఈ మధ్యే ముఖ్య మంత్రిని అవుతాను అని స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. అంటే కొంచం ఆలస్యమైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు, బావుంది. కానీ పార్టీ నిర్మాణం పట్ల శ్రద్ధ ఉన్నట్లుగా కనిపించటం లేదు. అడపా దడపా పక్క పార్టీల నుండి అసంతృప్తులు, సినిమా అభిమానులు, కుల అభిమానులు పార్టీలో చేరుతున్నా జనసేనకు ఒక స్పష్టమైన రూపం ఇంకా రాలేదు.
ఎన్నికలకు ఒక సంవత్సరం కన్నా తక్కువ సమయం ఉంది. ఇప్పటివరకు పార్టీ సిద్ధాంతాల పట్ల గానీ, పార్టీ స్ట్రక్చర్ పట్ల గానీ, మేనిఫెస్టో/ ట్రంప్ కార్డులనదగ్గ హామీలేమైనా ఉన్నాయా అనే విషయాల పట్ల గానీ స్పష్టత లేదు. ఎదో రాజకీయ పర్యటనలు చేస్తున్నాం, రోజూ మీడియాలో కనిపిస్తున్నాం, అక్కడ ఏవో హామీలు ఇచ్చేస్తున్నాం అంటే ఖచ్చితంగా కుదరదు. కావాలి అనుకున్న దాన్ని పొందగలిగే కార్యాచరణలో కూడా స్పష్టత ఉండి తీరాలి.
Post a Comment