లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, వర్షాకాల సమావేశాల మొదటిరోజు బుధవారం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమోదించారు. ఈ నోటీసుపై చర్చకు శుక్రవారం రోజును ఖరారు చేసారు.
అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం మోడీ ప్రభుత్వానికి ఇదే తొలిసారి. గత సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాసంపై నోటీసులను ఇచ్చినప్పటికీ, స్పీకర్ వాటిని ఆమోదించలేకపోయారు. అన్నాడీఎంకే సభ్యులు నిరసనలు తెలుపుతుండటంతో 50 మంది సభ్యుల మద్దతు ఉన్నది, లేనిది నిర్ధారించటానికి వీలవలేదు. అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు రావాలంటే కనీసం యాభయి మంది సభ్యుల మద్ధతు అవసరం.
కాంగ్రెస్ ప్రతినిధి మల్లికార్జున ఖర్గేతో సహా పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినప్పటికీ, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నుంచి అందిన నోటీసు వాటిలో మొదటిది కావడంతో స్పీకర్ దానిపై చర్చకు అంగీకరించారు. ఆ పార్టీ ప్రత్యేక హోదాకోసం ఈ నోటీసులు అందించగా, వేరు వేరు పార్టీలు అవిశ్వాసానికై వేరు వేరు కారణాలు పేర్కొన్నాయి.
టిఆర్ఎస్, బిజెడిల మద్ధతుపై బిజెపి లెక్కలు
ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవటానికి అవసరమైన మద్ధతు కంటే ఎక్కువ మంది సభ్యులు బిజెపి, ఎన్డీయేలకు ఇప్పటికే ఉన్నారు. కానీ వారు మరింత మందిని కూడగట్టి ప్రతిపక్షాలకు బలమైన సందేశం పంపాలనుకుంటున్నారు. దీనికోసం వారు టిఆర్ఎస్, బిజెడిల మద్దతు కోరే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టిఆర్ఎస్ చర్చలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు కావాల్సిన డిమాండ్లు చేసే అవకాశం ఉంది కానీ ఓటింగ్ లో మాత్రం ప్రభుత్వానికి మద్దతిచ్చే లేకపోతే తటస్థంగా ఉండే అవకాశం ఉంది. బిజెడి ఎన్డీయేకు మద్దతిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పార్లమెంటరి వ్యవహారాల మంత్రి అనంత కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు ఎన్డీయే 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది అని పేర్కొంటూ ప్రతిపక్షాలకు అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంపై విస్మయం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఎన్డీయే ఏకతాటిపై ఉంది. బయట పార్టీలు కూడా మద్ధతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పడు ఇది ఎన్డీయే+ అని వ్యాఖ్యానించారు.
వివిధ కారణాల వల్ల లోక్ సభలో 10 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వీగిపోవటానికి 268 మంది సభ్యుల మద్ధతు చాలు, కానీ బిజెపి ఒక్కదానికే 273 మంది సభ్యుల మద్దతు ఉంది. ఎన్డీయే, ఇతర పక్షాలను కలుపుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డు పడుతున్నారు. ఒక సారి అవిశ్వాస తీర్మానం వీగిపోతే ఇవి ఆగిపోతాయి అని కూడా వ్యాఖ్యానించారు.
మాకు మద్ధతు లేదని ఎవరన్నారు?
యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ విలేకరులతో మాట్లాడుతూ, మాకు సంఖ్యా బలం లేదని ఎవరన్నారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు. అవిశ్వాసంపై చర్చను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ రాజీవ్ సతవ్ అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఎంపీలలో కూడా కోపం, అసంతృప్తి ఉన్నాయి. మా వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నాము. నేను ఇప్పుడు మరిన్ని విషయాలు విషయాలు వెల్లడి చేస్తే మాకు నష్టం కలగవచ్చు అని కూడా అన్నారు.
తెలుగు దేశం పార్టీ వారు పార్లమెంట్లో నిరసన తెలపడానికి సిద్ధమై వచ్చారు. కానీ అవిశ్వాస తీర్మానంపై నోటీసును ఆమోదించటంతో మద్ధతు కూడగట్టే పనిలో పడ్డారు. శుక్రవారం రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ ముగిసిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం అని టిడిపి ఎంపీ తోట నరసింహం తెలిపారు.
Post a Comment