బుధవారం రోజు జూరాల, తుంగభద్ర డ్యామ్ లనుండి విడుదల చేసిన నీరు, గురువారం సాయంత్రానికి శ్రీశైలం చేరింది. దానితో ఈ సంవత్సరానికి తొలిసారి శ్రీశైలానికి చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరుకున్నట్లయింది. గురువారం సాయంత్రానికి 31,000 క్యూసెక్కుల ఇన్-ఫ్లో నమోదు కాగా శుక్రవారం ఉదయానికి ఇది 55 వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సెంట్రల్ వాటర్ కమీషన్ (సిడబ్ల్యుసి) అంచనా వేసింది. తుంగభద్ర మరియు కృష్ణా నదులలోని రెండు జలాశయాల నుండి వస్తున్న నీరు రానున్న ఒకటి రెండు రోజులలో భారీగా పెరగనుంది.
తుంగభద్ర డ్యామ్ బోర్డ్ అధికారులు స్పిల్ వే మరియు విద్యుత్ కేంద్రం నుండి శుక్రవారం నాటికి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవనుందని జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అధికారులకు వరద హెచ్చరికలు జారీ చేసారు.
జూరాల నుండి గేట్లు ఎత్తి ఇప్పటికే 62 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మరో 30 వేల క్యూసెక్కులు విద్యుత్ కేంద్రం నుండి విడుదల చేస్తున్నారు. ఈ నీటి విడుదల శుక్రవారం సాయంత్రం వరకు 1,71,200 క్యూసెక్కులకు పెరగనుంది. కాగా, జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల మరియు నీటి పారుదల పథకాలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Post a Comment