కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు

కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు
వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేసారు. ఆరు నెలల కాలం పాటు నగర బహిష్కరణ విధించినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అనుమతి లేకుండా హైదరాబాద్ నగరంలో ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేసారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకొని, నగరం నుండి బయటకు తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించి చిత్తూరు తరలిస్తున్నారు. ఒక వేళ అనుమతి లేకుండా నగరంలో ప్రవేశిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  ఒక టీవీ ఛానెల్ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు దానికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసామని ఆయన వివరించారు.

ఒక ఛానల్ లైవ్ కార్యక్రమంలో శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తో ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హిందూ మత సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్వక్తం చేసాయి. కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రను కూడా తలపెట్టారు. పోలీసులు దీనికి అనుమతి నిరాకరించి ఆయనను హౌస్ అరెస్టులో ఉంచారు.  నగరంలో అనవసర ఘర్షణలు చెలరేగకూడదనే ఉద్దేశ్యంతోనే పోలీసులు ఈ నిర్ణయాలు తీసున్నట్లు తెలుస్తుంది.

ఆయన భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో అలజడులు సృష్టిస్తుండటం తో కత్తి మహేశ్‌ నగరంలో ఉండటానికి అనర్హుడంటూ ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ తెలియజేసారు. 

0/Post a Comment/Comments