కర్కాటక సంక్రాంతి

కర్కాటక సంక్రాంతి
సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అని అంటారు.  ఈ సంక్రమణం రోజును సంక్రాంతి అని పిలుస్తారు. ఒక ఏడాదిలో 12 సంక్రమణ రోజులు అంటే 12 సంక్రాంతులు ఉంటాయి. మన అందరం జరుపుకునే సంక్రాంతి మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపు కుంటారు. 

సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడాన్ని కర్కాటక సంక్రాంతి అని అంటారు. కర్కాటక సంక్రాంతిని కరక సంక్రాంతి అని, అయన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ఈరోజు సూర్యుడు ఉత్తరాయనం నుండి దక్షిణాయనం లోకి ప్రవేశిస్తాడు కనుక అయన సంక్రాంతి అని పిలుస్తారు. 

సంక్రాంతి రోజుని పితృ కర్మలు జరపటానికి, దాన, పుణ్య కార్యములకు అనువైనదిగా భావిస్తారు. సంక్రమణ సమయానికి కొద్దిగా ముందు లేక తర్వాత నిర్దిష్ట కాల వ్యవధి పాటు మాత్రమే ఈ పుణ్య కాలం ఉంటుంది. 

కర్కాటక సంక్రమణానికి ముందు దాదాపు 12 గంటల (30 ఘటిల) ముందు నుండి సంక్రాంతి సమయం వరకు పుణ్యకాలంగా పరిగణిస్తారు. కర్కాటక సంక్రాంతి రోజున ఆ సమయంలో అన్న దానం, తిలాదానం, మరియు వస్త్ర దానం మంచి ఫలితాలనిస్తాయి. ఆ రోజు విష్ణు సహస్ర నామాన్ని పఠించటం, సూర్యున్ని ఆరాధించడం శుభకరం. 

సౌరమానం పాటించే రాష్ట్రాలలో సంక్రాంతి రోజున కొత్త నెల మొదలవుతుంది. పశ్చిమ బంగ, తమిళనాడు, ఇంకా మరికొన్ని రాష్ట్రాలలో ఈ పద్దతిని పాటిస్తున్నారు. సౌరమానం పాటించేవారికి కర్కాటక సంక్రాంతి తో సంవత్సరంలో నాలుగవ నెల మొదలవుతుంది. ఈ నెలను తమిళంలో ఆది మాసమని, మలయాళంలో కర్కాటక మాసమని, మరియు పశ్చిమ బంగలో ష్రాబోన్ అని పిలుస్తారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post