ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. 

10,351 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో గంటా ప్రకటించారు. రెండు అంశాల కారణంగా నోటిషికేషన్‌ను వాయిదా వేశామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వారం రోజుల్లో నోటిఫికేషన్  విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయకపోవడంతో నోటిఫికేషన్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టిందని, వాటికి సంబంధించిన వివరాలు పంపామని మంత్రి చెప్పారు. త్వరలోనే డీఎస్సీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుందని తెలిపారు. అలాగే ఎన్‌సీటీఈ ఆదేశాలపై స్పష్టత తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. బీఎడ్ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్‌సీటీఈ విడుదల చేసిన గెజిట్‌పై కూడా చర్చిస్తున్నామని గంటా తెలిపారు. 

టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహించేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు. కాగా ప్రభుత్వం జాప్యం చేయకుండా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

సీఎంతో విభేదాలు లేవు: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. భీమిలి సీటుపై ఏ గొడవా లేదని, అంతా మీడియా సృష్టేనని మంత్రి వెల్లడించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post