అంతరిక్ష ప్రయోగాలలో అప్రతిహత విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం మరో కొత్త విధానాన్ని విజయవంతంగా పరీక్షించింది. క్రూ ఎస్కేప్ సిస్టంగా వ్యవహరించే ఈ విధానం భవిష్యత్తులో రోదసీ ప్రయోగాలలో కీలకంగా మారనుందని తెలుస్తోంది. రాకెట్ ప్రయోగాలలో వ్యోమగాముల భద్రత దీనిపైనే ఆధారపడి ఉంటుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ పరీక్షను తుది వరకు అత్యంత రహస్యంగా నిర్వహించినట్లు సమాచారం. పరిశోధన కేంద్రానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన ఈ ప్రయోగానికి అర్ధరాత్రి దాటాక కౌంట్‌డౌన్ ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటలకు రాకెట్ మాడ్యూల్ నింగిలోకి ఎగిరింది. ఆకాశంలో 2.7 కిలోమీటర్ల పైకి చేరి, తిరిగి బంగాళాఖాతంలో పడిపోయింది. ఈ మధ్యలో మాడ్యుల్‌లో అమర్చిన రెండు ప్యారాచూట్‌లు విడివడి నెమ్మదిగా నీటిపై వాలాయి. దీంతో ప్రయోగం విజయవంతంగా పూర్తైందని ఇస్రో వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. 259 సెకండ్లపాటు కొనసాగిన ఈ ప్రయోగం ఆద్యంతాన్నీ రికార్డు చేయడానికి శాస్త్రవేత్తలు 300 సెన్సర్లు వినియోగించారు. రోదసీలోకి మానవ సహిత ప్రయోగాల దిశగా ఇస్రో చేస్తున్న పరిశోధనలో ఇదో కీలక ముందడుగు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మానవసహిత రాకెట్ ప్రయోగాలపై ప్రస్తుతానికి ఇస్రో ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు.. అయితే, ఇలాంటి ఓ ప్రయోగాన్ని చేపట్టాలంటే దాదాపు 2.5 బిలియన్ డాలర్ల సొమ్ము వెచ్చించాలని ఇస్రో అంచనా! ఈ తరహా ప్రయోగాలకు అనుమతి కోసం మరో ఏడు నుంచి పదేళ్ల సమయం పడుతుందని భావిస్తోంది.
అసలేమిటీ ప్రయోగం..
అంతరిక్ష అన్వేషణలో భాగంగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం తెలిసిందే! కొత్త గ్రహాలు, కొత్త వాతావరణంలోకి వ్యోమగాములను పంపడం వల్ల వారికి ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రయాణంలోనే అత్యవసరంగా రాకెట్‌ను ఖాళీ చేయాల్సి రావొచ్చు.. గమ్యం చేరుకున్నాక అక్కడ దిగే పరిస్థితులే ఉండకపోవచ్చు. తిరిగొచ్చే సమయంలో వాతావరణ రాపిడికి రాకెట్ పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం జరుగుతుందని తెలిసినా వేరే మార్గంలేక వ్యోమగాములు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి అత్యవసర సందర్భాలలో రాకెట్‌లోని వ్యోమగాములను తప్పించేందుకు ఈ ‘క్రూ ఎస్కేప్ సిస్టం’ ఉపయోగపడుతుంది. వ్యోమగాములు ఉండే భాగాన్ని ఈ వ్యవస్థ ద్వారా రాకెట్ నుంచి విడదీయవచ్చు.
ఇస్రో తొలి అడుగు..
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో గురువారం నాడు శాస్త్రవేత్తలు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ప్యాడ్ అబార్ట్ టెస్ట్ పేరుతో నిర్వహించిన ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమనౌకలో సిబ్బంది ఉండే భాగాన్ని విడదీసే ప్రక్రియ సాఫీగా జరిగిపోయింది. భవిష్యత్తులో రోదసీలోకి మానవ సహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో యోచిస్తున్న నేపథ్యంలో ఈ క్రూ ఎస్కేప్ సిస్టం అత్యంత కీలకంగా మారనుంది. ల్యాంచ్ ప్యాడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ సమయంలో వ్యోమగాములు సురక్షితంగా బయటపడే ప్రక్రియను క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా పరీక్షించారు. ప్రయోగ కేంద్రంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పరీక్షలో భాగంగా తొలుత క్రూ ఎస్కేప్ సిస్టం మాడ్యుల్ ప్రయోగానికి ఐదు గంటల కౌంట్ డౌన్ నిర్వహించారు. అనంతరం 12.6 టన్నుల బరువున్న ఈ మాడ్యుల్ గాలిలోకి ఎగిరింది. బంగాళాఖాతం సముద్ర ఉపరితలంపై ఈ మాడ్యూల్ నుంచి ప్యారాచూట్లు వేరుపడి సముద్రంలో పడ్డాయి. మాడ్యుల్ కూడా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సెన్సార్ల ద్వారా రికార్డింగ్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Post a Comment