ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి?

ఏకాదశి వ్రతం ఎలా చేయాలి?
శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థ్యం ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని చేసేవారు అధిక నియమ నిష్ఠలు పాటిస్తారు. సంవత్సరంలో 24 ఏకాదశి రోజులు ఉంటాయి. అధిక మాసం వచ్చిన సందర్భంలో మాత్రం 2 ఏకాదశులు అధికంగా వస్తాయి. 

ఏకాదశి, దశమి కలిసి ఉన్నరోజు ఏకాదశి వ్రతానికి పనికి రాదు. ఏకాదశి, ద్వాదశి కలిసి వచ్చినప్పుడు, ఏకాదశి మిగులు రోజు అంటే ద్వాదశి రోజు ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి.

తర్వాత రోజు సూర్యోదయం సమయంలో త్రయోదశి ఉన్న ఏకాదశి-ద్వాదశి కలసి ఉన్న రోజును మహాద్వాదశి అంటారు. అప్పుడు ఉపవాస విరమణ సమయంలో త్రయోదశి ఉంటుంది. 

ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి అయిన తర్వాత విష్ణువును పూజించాలి. క్రింది నియమాలను విధిగా పాటించాలి. 

ఏకాదశి వ్రత నియమాలు 

- కేవలము నీటితో కఠిన ఉపవాసం చేయడం శ్రేయస్కరం. కానీ ఇది చేయడానికి అందరి ఆరోగ్యాలు గానీ, పరిస్థితులు గానీ సహకరించవు. అటువంటివారు పండ్లు, పాలు, వేర్లు లాంటి పదార్థాల్ని తీసుకువచ్చు. కానీ ధాన్యానికీ, పప్పు దినుసులకూ దూరంగా ఉండాలి. వంటలో జీలకర్ర, మిరియాలు, రాతి ఉప్పు తప్ప మిగిలిన ఏ మసాలా పదార్థాలు వాడకూడదు. ఇంగువను ఉపయోగించకూడదు. టమోటాలు, వంకాయలు, కాలిఫ్లవర్, మరియు ఆకు కూరలు కూడా నిషిద్ధమే. 

- కఠిన ఉపవాసం చేసేవారు నిర్జల ఏకాదశి రోజు తప్ప మిగిలిన రోజులలో మంచి నీరు తీసుకోవచ్చు. 

- ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో చెట్టు నుండి తులసి ఆకులను తుంచకూడదు. 

- నేలమీదే పడుకోవాలి మరియు బ్రహ్మ చర్యం పాటించాలి. 

- అసత్యం ఆడరాదు. వీలైనవారు విష్ణు సహస్ర నామం పఠించటం, ఆ ఏకాదశికి సంబంధించిన కథను వినటం చేయాలి. 

- రాత్రి జాగరణ శ్రేయస్కరం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాటించటం కష్టం. 

ఉపవాస విరమణ 

ఉపవాసం తర్వాత రోజు సూర్యోదయం అయిన తర్వాత మాత్రమే, విష్ణువును పూజించి ఆ నైవేద్యంతో ఉపవాసాన్ని విరమించాలి.

ఏకాదశి వ్రతానికి విష్ణువుని, శివుణ్ని స్మరించటం, సూర్య నమస్కారం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ఆచరించవలసిన ముఖ్యమైన అంశాలు. వీటిద్వారా అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం పొందవచ్చని స్మృతి పురాణం చెబుతోంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post